బిజెపి రైతులను మోసం చేస్తోంది... ఆర్ఎస్ఎస్ రైతు విభాగం ధ్వజం
భారతీయ జనతా పార్టీ రైతులను మోసం చేస్తోందంటూ ఆరెస్సెస్ అనుబంద సంఘం భారతీయ కిసాన్ సంఘ్ ద్వజమెత్తింది. తప్పుడు ప్రకటనలతో రైతులను మోసం చేయడం ఆపేయాలని బీజేపీ నాయకులకు బిఎకెఎస్ గుజరాత్ శాఖ కమ్యూనికేషన్ల విభాగం సహ అధ్యక్షుడు మన్‌సుఖ్ పటోలియా అల్టిమేటం జారీ చేసింది.
రైతులకు బిజెపి ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ ఆర్ఎస్ఎస్ రైతు విభాగం భారతీయ కిసాన్ సంఘ్ (బికెఎస్) విమర్శించింది. అమలు కాని హామీలు, తప్పుడు ప్రకటనలతో రైతులను మోసం చేయడం ఆపేయాలని అల్టిమేటం జారీ చేసింది.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గుజరాత్ పర్యటనలో భాగంగా 'నమో ఖేదుత్ పంచాయితీ' ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో రైతులకు ఎవరైనా ఏమైనా చేశారంటే అది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక్కరేనంటూ నడ్డా ప్రధానిని ఆకాశానికెత్తేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. ఇతరులు రైతు నాయకులు అనిపించుకోవడం కోసం రైతు పేరును ఉపయోగించుకుంటూ వారిని మోసం చేస్తున్నారని నడ్డా అన్నారు.
ఈ సందర్భంలో నడ్డాను కలిసేందుకు బికెఎస్ నాయకులు ప్రయత్నించగా వారిని గాంధీ నగర్ లో పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. నడ్డా ప్రసంగం పూర్తయి ఆయన వెళ్ళిపోయేవరకూ రైతునాయకులను విడుదల చేయలేదు. ఆర్ఎస్ఎస్ రైతు విభాగం ఆధ్వర్యంలో నాయకులు తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 26 డిమాండ్‌లను హైలైట్ చేస్తూ 28 రోజులుగా ధర్నాచేస్తున్నారు.
విడుదలైన తర్వాత, బికెఎస్ నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. బిజెపి జాతీయ అద్యక్షుడిని కలిసి తమ సమస్యలను వివరించేందుకు ప్రయత్నించగా బిజెపి కార్యకర్తలు తమను అడ్డకుని దారుణంగా ప్రవర్తించారని రైతు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి మమ్మల్నందరినీ వ్యానులో కుక్కుకుని తీసుకెళ్ళారని బిఎకెఎస్ గుజరాత్ శాఖ కమ్యూనికేషన్ల విభాగం సహ అధ్యక్షుడు మన్‌సుఖ్ పటోలియా తెలిపారు.
భూమికి సంబంధించి రీ సర్వే, పంటల బీమా తదితరాలు తమ డిమాండ్లలో ఉన్నాయి. పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో ట్రాక్టర్లతో పొలాలు దున్నుకోవడం కుదరడం లేదని వ్యవసాయ పనులు కుంటుపడుతున్నాయని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు వాదనలు చేయడం, రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే చివరి హెచ్చరిక అని వారు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుని ఉద్యమిస్తామని హెచ్చరించారు.
నడ్డా పాల్గొన్న ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్‌కుమార్ చాహర్ కూడా పాల్గొనడం గమనార్హం.