Telugu Global
National

పురుషులతో సమానంగా ఆస్తి హక్కు కోసం ముస్లిం మహిళల పోరాటం

“ఇస్లాంను అనువదించిన, వ్యాఖ్యానించిన వారు పురుషులు, అందువల్ల చట్టాలు పితృస్వామ్యమైనవి, మహిళలకు సమాన హక్కులను లేకుండా చేశాయి. హిందూ, క్రిస్టియన్ వ్యక్తిగత చట్టాలను స్త్రీ, పురుషులను సమానంగా చూస్తూ సవరించినప్పుడు, ముస్లిం వ్యక్తిగత చట్టాల విషయంలో ఇంకా ఎందుకు జరగలేదు? అని రచయిత, ఆక్టివిస్టు VP సుహ్రా ప్రశ్నించారు.

పురుషులతో సమానంగా ఆస్తి హక్కు  కోసం  ముస్లిం మహిళల పోరాటం
X

ఫోరమ్ ఫర్ ముస్లిం ఉమెన్స్ జెండర్ జస్టిస్ (FMWGJ) మార్చి 12, ఆదివారం కేరళలోని కోజికోడ్‌లో ముస్లిం వ్యక్తిగత చట్టాలలో లింగ సమానత్వం యొక్క ఆవశ్యకతపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ముస్లిం పర్సనల్ లా (షరియత్) అప్లికేషన్ యాక్ట్ 1937 వివక్షతతో కూడినదని విమర్శిస్తూ, FMWGJ ముస్లిం మహిళలకు సమానమైన ఆస్తి వారసత్వ హక్కులను కల్పించడానికి చట్టపరమైన సంస్కరణలను డిమాండ్ చేసింది. ముస్లిం మహిళల కోసం, ముస్లింల కోసం ఆస్తి హక్కుకోసం నిర్వహించబడిన బహుషా దేశంలోనే మొట్టమొదటి సమావేశం ఇది.

'ఉయిర్ప్పు' (మలయాళంలో పునరుత్థానం అని అర్థం) పేరుతో జరిగిన ఈ కార్యక్రమాన్ని కోజికోడ్ టౌన్ హాల్‌లో ఏర్పాటు చేశారు.

ప్రస్తుతానికి, వ్యక్తిగత చట్టం ముస్లిం స్త్రీ తన భర్త ఆస్తిలో ఎనిమిదో వంతు వాటాను, తన సోదరులకు పూర్వీకుల ఆస్తి నుండి ఇచ్చిన దానిలో సగం మాత్రమే క్లెయిమ్ చేయడానికి అనుమతినిస్తోంది. స్త్రీకి సోదరులు లేని పక్షంలో, ఆమె తండ్రి ఆస్తి అతని సోదరులకు చెందుతుంది.

కేరళ అంతటా ముస్లిం మహిళలతో కూడిన FMWGJ, వారసత్వ చట్టాలపై అవగాహన పెంచడానికి రాష్ట్రంలోని అనేక ఇతర జిల్లాల్లో ఒక సంవత్సరం ముందు నుంచీ చిన్న చిన్న‌ సమావేశాలను ఏర్పాటు చేసింది. ఫోరమ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన‌ రచయిత, ఆక్టివిస్టు VP సుహ్రా ముస్లిం మహిళలకు సమాన వారసత్వ హక్కులను డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసిన వారిలో ఒకరు. ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సుహ్రా తన ప్రసంగంలో, ఇది ఇతర మతాలలో ఎలా జరిగిందో అదే విధంగా మన మతంలో కూడా జరగాలి అన్నారు. “ఇస్లాంను అనువదించిన, వ్యాఖ్యానించిన వారు పురుషులు, అందువల్ల చట్టాలు పితృస్వామ్యమైనవి, మహిళలకు సమాన హక్కులను లేకుండా చేశాయి. హిందూ, క్రిస్టియన్ వ్యక్తిగత చట్టాలను స్త్రీ, పురుషులను సమానంగా చూస్తూ సవరించినప్పుడు, ముస్లిం వ్యక్తిగత చట్టాల విషయంలో ఇంకా ఎందుకు జరగలేదు? అని సుహ్రా ప్రశ్నించారు.

డాక్టర్ ఖతీజా ముంతాజ్, ఎం సుల్ఫత్, నిలంబూర్ అయేషా, కె అజిత వంటి ప్రముఖ లింగ వివక్ష వ్యతిరేక న్యాయవాదులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ షీనా షుకూర్ మాట్లాడుతూ కుమార్తెలను అన్ని విధాలుగా కొడుకులతో సమానంగా భావించాలని, ముస్లిం మహిళలకు భరోసా కల్పించేందుకు ఎఫ్‌ఎండబ్ల్యూజీజే చేస్తున్న కృషి తొలి అడుగు అని అన్నారు.

ప్రముఖ సాహితీ, సాంస్కృతిక దిగ్గజాలు షిహాబుద్దీన్ పైతుంకడవు, కెఇఎన్ కుంజహమ్మద్, పిటి కుంజుముహమ్మద్, మరియు కల్పత్త నారాయణన్ తదితరులు సంఘీభావం తెలుపుతూ, ముస్లిం మహిళల సమాన ఆస్తి హక్కుల డిమాండ్ కు మద్దతు పలికారు.

ప్రసంగాల అనంతరం ఇస్లామిక్ చట్టాలు, సృజనాత్మక స్వేచ్ఛపై చర్చ జరిగింది. ప్రస్తుత వారసత్వ చట్టాల కారణంగా నష్టపోయిన మహిళలు తమకు జరిగిన ఆర్థిక, సామాజిక నష్టాన్ని గురించిన సెషన్ ను కూడా నిర్వహించారు. మతపరమైన సంప్రదాయవాదుల నుండి, రాజ్యం నుండి ఎంత ప్రతిఘటన వచ్చినా, పోరాటాన్ని కొనసాగించాలని సమావేశం పిలుపునిచ్చింది.

First Published:  13 March 2023 7:20 AM IST
Next Story