హిందూ అమ్మాయితో మాట్లాడినందుకు ముస్లిం విద్యార్థిపై మూక దాడి
తన క్లాస్ మేట్ అయిన హిందూ విద్యార్థినితో మాట్లాడటమే పాపమయ్యింది ఓ ముస్లిం విద్యార్థికి. మరి కొందరు విద్యార్థులు అతనిపై దాడి చేసి దారుణంగా కొట్టారు. మరో సారి మాట్లాడితే చంపేస్తామని హెచ్చరించారు.
కర్నాటకలో ఓ కాలేజీలో ముస్లిం విద్యార్థి తన తోటి హిందూ విద్యార్థినితో మాట్లాడినందుకు అదే కాలేజీలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు ఆ విద్యార్థిపై దారుణంగా దాడి చేసి కొట్టారు.
దక్షిణ కన్నడ జిల్లా సుల్లియా తాలూకా పరిధి, కసబా గ్రామంలోని కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న పంతొమ్మిదేళ్ల మహమ్మద్ సనీఫ్ తన క్లాస్ మేట్ అయిన అమ్మాయితో మాట్లాడాడు. అది చూసిన బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్న కొందరు హిందూ విద్యార్థులకు కోపం వచ్చింది.
దీక్షిత్, ధనుష్ అనే ఇద్దరు కుర్రాళ్లు సనీఫ్‌తో మాట్లాడాలని , కళాశాల మైదానానికి రావాలని కోరారు. నిజమని నమ్మిన సనీఫ్ అక్కడికి వెళ్ళాడు. వీళ్ళిద్దరే కాక అక్కడ ప్రజ్వల్, తనూజ్, అక్షయ్, మోక్షిత్ , గౌతమ్ అనే మరో ఐదుగురు ఉన్నారు. సనీఫ్ అక్కడికి చేరుకోగానే అతనిపై దారుణంగా దాడి చేశారు చెక్క దుంగలతో కొట్టారు. నేలపైకి తోసేసి ఇష్టమొచ్చినట్టు తన్నారు. ఇంతలో సనీఫ్ తో మాట్లాడిన అమ్మాయి అక్కడికి వచ్చి వాళ్ళనుంచి సనీఫ్ ను కాపాడటానికి ప్రయత్నించింది. అయితే ఆ నిందితులు వారిద్దరి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించారని పోలీసులు తెలిపారు.
మరో సారి ఆ అమ్మాయితో మాట్లాడితే చంపేస్తామని హెచ్చరించి, తీవ్ర గాయాలపాలైన సనీఫ్ ను ఆ దాడి చేసిన మూక అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సనీఫ్ అతి కష్టం మీద ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుని అనంతరం సుళ్లయా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సనీఫ్ ను కొట్టిన విద్యార్థులపై పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 323 ( గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు), 143 (చట్టవిరుద్ధమైన సమావేశం), 147 (అల్లర్లు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
అయితే, ఇప్పటివరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.