Telugu Global
National

మసీదులో హిందూ జంట పెళ్లి.. దగ్గరుండి జరిపించిన ముస్లిం మత పెద్దలు

వేద పండితుల పక్కనే ముస్లిం మత పెద్దలు కూర్చుని పెళ్లి జరిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు వధువు తరఫున భారీగా కట్న కానుకలు అందజేశారు. 10 తులాల బంగారం, దంపతులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

మసీదులో హిందూ జంట పెళ్లి.. దగ్గరుండి జరిపించిన ముస్లిం మత పెద్దలు
X

భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా ఎందుకు పిలుస్తారో మరోసారి రుజువు అయింది. ఒక్కోసారి మతాల పేరిట ఘర్షణలు జరుగుతున్నప్పటికీ మనమందరం భారతీయులం అనే జాతీయతా భావం అందరిలోనూ ఉంది. సంఘ విద్రోహ శక్తులతో పాటు రాజకీయ నాయకులు ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నప్పటికీ జనం మధ్య మాత్రం ఈ అంతరాలు అంతగా కనిపించవు. కేరళలో జరిగిన ఓ సంఘటన ఇందుకు నిదర్శనం.

ఓ పేదింటి అమ్మాయికి ముస్లిం మత పెద్దలు మసీదులో పెళ్లి జరిపించారు. అది కూడా పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం. వేద పండితుల పక్కనే ముస్లిం మత పెద్దలు కూర్చుని పెళ్లి జరిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు వధువు తరఫున భారీగా కట్న కానుకలు అందజేశారు. 10 తులాల బంగారం, దంపతులకు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పెళ్లికొచ్చిన వెయ్యి మందికి భోజనాలు కూడా పెట్టించారు. తన కూతురికి పెళ్లి చేయలేని స్థితిలో ఉన్నానని, తగిన సహాయం చేసి పెళ్లి చేయాలని ఓ పేదింటి తల్లి కోరడంతో ముస్లింలు అంతా ఒక్కటై ఈ పెళ్లి జరిపించారు.

అయితే ఈ పెళ్లి వేడుక ఇప్పుడు జరిగినది కాదు. 2020లో కేరళ రాష్ట్రం అలప్పులోని చెరువల్లి ముస్లిం జమాత్ మసీదులో జరిగింది. అయితే పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలను ఇటీవల కొందరు సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మసీదులో హిందూ మతానికి చెందిన పేదింటి అమ్మాయికి ముస్లింలు దగ్గర ఉండి వెళ్లి జరిపించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని వారాలుగా ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. భారతదేశంలో మతాల మధ్య దూరం లేదని.. కొందరు కావాలని సృష్టిస్తున్నారని.. ఈ వీడియోలు చూసినవారు కామెంట్లు పెడుతున్నారు.

First Published:  4 May 2023 5:39 PM IST
Next Story