ఆ మహిళా కానిస్టేబుల్‌కు బంపర్ ఆఫర్
కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్‌కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్దానీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కంగనాపై చేయిచేసుకున్న ఘటనలో ఆమెకు మద్దతు ప్రకటించిన ఆయన.. ఆ ఘటనలో ఆమె తన ఉద్యోగం కోల్పోతే గనుక.. ఆమె అంగీకరిస్తే తాను ఆమెకు తగిన ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.
కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ఇప్పటికే అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రైతుల ధర్నాను ఉద్దేశించి గతంలో కంగనా కామెంట్స్ చేసినందుకే తాను కొట్టినట్లు సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వెల్లడించారు. ఇదే విషయాన్ని కంగనా కూడా అంగీకరించడం గమనార్హం.
తాను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వనని, కానీ ఆ కానిస్టేబుల్ కోపాన్ని తాను కచ్చితంగా అర్థం చేసుకున్నానని మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్దానీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ ఆమెపై చర్యలు తీసుకున్నట్లయితే.. ఉద్యోగం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నానని.. జై హింద్. జై జవాన్. జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఎవరైనా మీ మదర్ రూ.100కు అందుబాటులో ఉందని కామెంట్ చేస్తే నువ్వు ఏం చేస్తావ్? అంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. గతంలో కంగనా రైతుల ధర్నాను ఉద్దేశించి రూ.100 కోసం వచ్చారంటూ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు బిల్కిస్ బానో విషయంలోనూ కంగనా చేసిన పోస్టును ఈ సందర్భంగా విశాల్ షేర్ చేశారు.