ఆ కేసులో క్షమాభిక్ష పిటిషన్‌కు రాష్ట్రపతి నో
నాలుగేళ్ల బాలికపై ఆమె పొరుగింటిలో ఉండే వసంత సంపత్ దుపారే లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం బండరాళ్లతో కొట్టి హతమార్చాడు. ఈ కేసులో దోషికి క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి నిరాకరించారు.
నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం బండరాళ్లతో కొట్టి చంపేసిన కేసులో దోషికి క్షమాభిక్ష పెట్టేందుకు రాష్ట్రపతి నిరాకరించారు. రాష్ట్రపతి భవన్ కార్యాలయం గురువారం ఈ విషయం వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 28న కేంద్ర హోం శాఖ ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి సచివాలయానికి సిఫార్సు చేసిందని, దానిని ఏప్రిల్ 10వ తేదీనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారని తెలిపింది.
మహారాష్ట్రలో 2008లో ఈ దారుణం జరిగింది. నాలుగేళ్ల వయసున్న బాలికపై ఆమె పొరుగింటిలో ఉండే వసంత సంపత్ దుపారే (అప్పటికి అతని వయసు 46 ఏళ్లు) ఈ దారుణానికి ఒడిగట్టాడు. తినుబండారాల ఆశ చూపి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను బండరాళ్లతో మోది హతమార్చాడు.
చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వసంత సంపత్ దుపారేను అరెస్టు చేశారు. ట్రయల్ కోర్టు విచారణలో అతను దోషిగా తేలింది. దీంతో అతనికి మరణ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై దుపారే.. బాంబే హైకోర్టుకు వెళ్లగా.. అక్కడా అతనికి చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
దుపారే అంతటితో ఆగక 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అత్యున్నత న్యాయస్థానం కూడా అతడి మరణశిక్షను సమర్థించింది. ఆ తీర్పును పునర్ సమీక్షించాలని మరోసారి అతను రివ్యూ పిటిషన్ వేయగా 2017లో న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది అత్యంత హేయమైన నేరంగా పేర్కొన్న సుప్రీంకోర్టు అతడి శిక్షను మరోసారి సమర్ధించింది. దీంతో దుపారే క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకు నిరాకరించారు.