Telugu Global
National

ముంబ‌యి-సికింద్రాబాద్ దేవ‌గిరి ఎక్స్‌ప్రెస్‌కి త‌ప్పిన పెను ముప్పు

ట్రాక్ మ‌ధ్య‌లో రాళ్ల‌తో నింపిన డ్ర‌మ్ము ఉండ‌టాన్ని లోకోపైలట్‌ గుర్తించి రైల్వే భ‌ద్ర‌తా సిబ్బంది (ఆర్‌పీఎఫ్‌)కి స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది డ్ర‌మ్మును అక్క‌డి నుంచి తొల‌గించారు.

ముంబ‌యి-సికింద్రాబాద్ దేవ‌గిరి ఎక్స్‌ప్రెస్‌కి త‌ప్పిన పెను ముప్పు
X

ముంబయి - సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్ర‌మాదం త‌ప్పింది. రైలు ప‌ట్టాల‌పై రాళ్ల‌తో నింపిన డ్ర‌మ్ము ఉండ‌టాన్ని గుర్తించిన డ్రైవ‌ర్ వెంట‌నే ఎమ‌ర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. దీంతో త్రుటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. మ‌హారాష్ట్ర‌లోని జ‌ల్నా జిల్లాలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

ముంబయి నుంచి సికింద్రాబాద్‌కు బ‌య‌లుదేరిన దేవ‌గిరి ఎక్స్‌ప్రెస్ శుక్ర‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో సతోనా - ఉస్మానుర్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా ప‌ట్టాల‌పై ఏదో వ‌స్తువు ఉండ‌టాన్ని లోకో పైల‌ట్ గుర్తించాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై రైలును ఆపి కిందికి దిగి చూశాడు. ట్రాక్ మ‌ధ్య‌లో రాళ్ల‌తో నింపిన డ్ర‌మ్ము ఉండ‌టాన్ని గుర్తించి రైల్వే భ‌ద్ర‌తా సిబ్బంది (ఆర్‌పీఎఫ్‌)కి స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న ఆర్‌పీఎఫ్ సిబ్బంది డ్ర‌మ్మును అక్క‌డి నుంచి తొల‌గించారు.

ఆ త‌ర్వాత రైలు తిరిగి సికింద్రాబాద్ బ‌య‌లుదేరింది. ఈ ఘ‌ట‌న‌పై రైల్వే పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ డ్రమ్ము ఎవ‌రు పెట్టి ఉంటారు.. ఇందులో ఏమైనా విద్రోహ కుట్ర ఉందా.. అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రినీ అరెస్టు చేయ‌లేద‌ని అధికారులు తెలిపారు.

First Published:  7 July 2023 3:39 PM IST
Next Story