కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి.. - మృతుల సంఖ్య పెరిగే అవకాశం
శిథిలాల కింద దాదాపు 100 మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి దాదాపు 15 మంది మృతిచెందిన దుర్ఘటన మహారాష్ట్రలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖలాపూర్ సమీపంలోని కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 15 నుంచి 20 మంది మృతిచెంది ఉంటారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెల్లడించారు.
శిథిలాల కిందే దాదాపు 100 మంది
అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఇర్సల్‌వాడి కొండపై ఉన్న గ్రామంలోని 30 ఇళ్లపై మట్టి పెళ్లలు, కొండ రాళ్లు పడ్డాయి. దీంతో గృహాలన్నీ నేలమట్టం అయ్యాయి. ఈ శిథిలాల కింద దాదాపు 100 మంది చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామానికి వాహనాల్లో వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో కాలినడకనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. దాదాపు 75 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ఘటనాస్థలిని పరిశీలించిన ముఖ్యమంత్రి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం ఉదయం ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రక్షణ చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మృతిచెందిన కుటుంబాలకు సీఎం షిండే రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తక్షణ సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ముంబై నుంచి నౌకాదళ సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. దాదాపు 100 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని రాయ్‌గఢ్ పోలీసులు తెలిపారు.