Telugu Global
National

ముంబై రైల్వే లేన్లు.. ప్రాణాలు తీసే డేంజర్ జోన్లు..

2021లో 244 మంది రైలు ప్రమాదాల వల్ల గాయపడగా 142 మృతి చెందారు. కానీ 2022లో ఎనిమిది నెలల్లోనే రైలు పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందగా 140 గాయపడ్డారు.

ముంబై రైల్వే లేన్లు.. ప్రాణాలు తీసే డేంజర్ జోన్లు..
X

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ చివరి వరకు.. అంటే 8 నెలల కాలంలో ముంబైలో రైల్వేల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2020. కదులుతున్న రైళ్ల నుంచి కిందపడిపోయిన వారి సంఖ్య 415 కాగా రైల్వే ట్రాక్ లపై వివిధ కారణాల వల్ల చనిపోయినవారి సంఖ్య 1605. ముంబై లోకల్ రైల్వే పోలీసుల రికార్డుల్లో ఈ గణాంకాలు నమోదయ్యాయి.

కరోనా తర్వాత మరీ ఘోరం..

కరోనా కాలంలో రైలు ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రమాదాల సంఖ్య దాదాపుగా అదుపులోకి వచ్చింది. తిరిగి లోకల్ రైళ్లను ప్రారంభించినా గతంలో లాగా రద్దీ లేదు. అన్ని ఆఫీస్‌లు టైమింగ్స్‌ని మార్చడం, సిబ్బందిని తగ్గించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ కావడంతో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య తగ్గిపోయింది. రద్దీ కారణంగా రైళ్లలో డోర్ల దగ్గర నిలబడి వేలాడుతూ వెళ్లేవారి సంఖ్య తగ్గింది కానీ ప్రమాదాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయం.

రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో రైలు సర్వీసులు లేవని భావించి, రైల్వే లైన్లు దాటడం ద్వారా ప్రజలు షార్ట్ కట్‌లను తీసుకుంటున్నారని, ఇదే ప్రమాదానికి కారణమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రైల్వే లైన్లలో మరణాలకు అక్రమ ఎంట్రీ పాయింట్లే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు ప్లాట్‌ ఫారమ్‌లను కలిపే ట్రాక్‌ల మధ్య కంచెలు వేయాలని, ట్రాక్‌ క్రాసింగ్‌ ల సంఖ్యను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. నడుస్తున్న రైళ్ల నుండి పడిపోయే వ్యక్తుల సమస్యను తగ్గించడానికి లోకల్‌ రైళ్ల తలుపులు మూసేయడం వంటి మరిన్ని ప్రయోగాలు చేయాలని సూచిస్తున్నారు.

రైలు పట్టాలు దాటుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య మొదటి స్ధానంలో ఉండగా, రైలు నుంచి పడి మృతి చెందుతున్నవారి సంఖ్య రెండో స్ధానంలో ఉంది. 2021లో 244 మంది రైలు ప్రమాదాల వల్ల గాయపడగా 142 మృతి చెందారు. కానీ 2022లో ఎనిమిది నెలల్లోనే రైలు పట్టాలు దాటుతూ 767 మంది మృతి చెందగా 140 గాయపడ్డారు. మృతులు, గాయపడినవారిలో పురుషుల సంఖ్యే ఎక్కువ. రైళ్ల నుంచి కిందపడి చనిపోయిన వారి సంఖ్య 415 కాగా.. మృతుల్లో 38 మంది మహిళలుండగా 377 మంది పురుషులు.

First Published:  19 Sept 2022 11:15 AM IST
Next Story