ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు
రాజాసింగ్ రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి.. మతసామరస్యానికి భంగం కలిగించారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన రాజాసింగ్‌పై ముంబైలో కేసు నమోదయ్యింది. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన ఓ సభలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక పోలీసులు కేసు పెట్టారు. రాజా సింగ్‌పై ఐపీసీ 153 ఏ1(ఏ) కింద కేసులు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబైలోని హిందూ సకల్ సమాజ్ మోర్చాలో రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దాదార్ పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్ అయ్యింది.
రాజాసింగ్ రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి.. మతసామరస్యానికి భంగం కలిగించారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. జనవరి 29న ముంబైలోని శివాజీ పార్క్ నుంచి దాదర్‌లో ఉన్న మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల అనుమతి మేరకు మార్చ్ నిర్వహించి, నిరసన కార్యక్రమం కూడా చేపట్టారని.. అయితే రాజాసింగ్ మాత్రం రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
రాజా సింగ్ చేసిన అభ్యంతరకరమైన స్పీచ్‌కు సంబంధించిన వీడియో ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ర్యాలీలో ఎంతో మంది బీజేపీ నాయకులు పాల్గొన్నా.. కేవలం రాజాసింగ్ మాత్రమే 30 నిమిషాల పాటు లవ్ జీహాద్ గురించి మాట్లాడారు. హిందూ సమాజం అంతా ఒక సంఘ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడాల్సిన వచ్చిందని చెప్పారు. మన సోదరీమణులు, కుమార్తెలు ఈ వ్యవస్థీకృత పథకాలకు బలవుతున్నారని ఆరోపించారు. మైనార్టీ కమ్యూనిటీకి చెందిన ఆ సభ్యుల దుకాణాల నుంచి ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదని ఆయన పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రశాంతంగా జరిగిన ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.. ఒక వర్గంపై బురదజల్లడం వంటి అభియోగాలు మోపారు. గతంలో కూడా మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన షరతులతో కూడిన బెయిల్‌పై ఉంటున్నారు.