ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం.. ఆసుపత్రిలో చేరిక
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ను అత్యవసరంగా ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఐసియూ వార్డులో చేర్పించారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల సూచన మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
ములాయం సింగ్ యాదవ్‌ను గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలోని ఐసియూ వార్డులో చేర్పించారు. ములాయం యాదవ్ గత కొన్ని నెలలుగా పలు ఆరోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం సాధారణ పరిస్థితికి రావడంతో కొన్ని రోజుల క్రితమే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
అయితే ఈరోజు ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ తన తండ్రి పక్కనే ఉండేందుకు ఢిల్లీ బయలుదేరారు.ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కూడా గురుగ్రామ్‌కు వెళ్లే అవకాశం ఉంది.
సమాజ్ వాదీ పార్టీ అధినేత, 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.