ములాయం సింగ్ యాదవ్ కన్ను మూత!
ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయమ్ సింగ్ యాదవ్ కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా హర్యానా , గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.
సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (82) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హర్యానాలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ములాయం మరణంతో సోషలిస్టు ఉద్యమం ఓ ప్రముఖ నేతను కోల్పోయింది. దేశ సోషలిస్టు రాజకీయాల్లో ఒక శకం ముగిసినట్టుగా భావించాలి. నవంబర్ 22, 1939న ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో జన్మించిన యాదవ్, ఉత్తరప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ నాయకులలో ఒకరు గా ఎదిగిన ములాయంను రాష్ట్ర ప్రజలు ప్రేమగా నేతాజీ అని పిలుచుకుంటారు. మల్లయోధుడిగా పేరుగాంచిన ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లో అనేక కుస్తీ లు చేశారంటే అతిశయోక్తి కాదు. 15 యేళ్ళ చిరు ప్రాయంలోనే ఆయన సోషలిస్టు రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. రాంమనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ వంటి మహామహుల మార్గదర్శకత్వంలో ములాయం రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుని క్రమంగా రాటు దేలారు. ములాయం రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయి పదవులు పొంది రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1967 లో ఆయన తొలిసారిగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ లో ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన 19 నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. 1977లో ఆయన తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. 1980 ఉత్తరప్రదేశ్ లోక్ దళ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ పార్టీ జనతా దళ్ లో భాగమైంది. 1989లో జనతాదళ్ తరపున ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు.
కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం ములాయం ఎంతో కృషి సలిపారు. రాష్ట్రాల సమస్యలను కేంద్రం పట్టించు కోవడంలేదని ఈ పరిస్థితిలో మార్పు రావాలని తపించారు. ఈ క్రమంలోనే ఆయన 1992 లో ప్రాంతీయ పార్టీగా సమాజ్ వాది పార్టీ ని ఏర్పాటు చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే కేంద్ర ప్రబుత్వాల నుంచి రాష్ట్రాల ప్రయోజనాలు పొందడం సులభమవుతుందని, కేంద్రంలో కీలక వ్యవహరించే అవకాశం ఉంటుందని బలంగా విశ్వసించిన వ్యక్తి ములాయం. కేవలం నమ్మకమే కాదు అలా నిరూపించిన గొప్ప రాజకీయ నాయకుడు . కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేయడంలోకీలక పాత్ర పోషించారు. దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్ ప్రధానులు కావడం వెనక నేతాజీ వ్యూహం గట్టిగా పనిచేసింది.
ములాయంసింగ్ యాదవ్ ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్‌యాదవ్.రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్‌యాదవ్ లోహియా. అఖిలేష్ యుపి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన సీఎం అయిన తర్వాత తండ్రీ కొడుకుల మద్య విభేదాలు తలెత్తాయి. దీంతో ములాయంను పార్టీ అధ్యక్ష పదవినుంచి తొలగించి ఛీఫ్ పాట్రన్ గా నియమించారు. ఈ తతంగం వెనక తన బంధువు రాంగోపాల్ యాదవ్ ఉన్నట్టు గ్రహించిన ములాయం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నో రాజకీయ ఆటుపోట్లను తట్టుకుని ధీశాలిగా నిలిచిన ఈ రాజకీయమల్ల యోధుడు చివరికి మౌనంగా కన్నుమూయడం విషాదం. ములాయం మృతికి పలువురు ప్రముఖుల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు.