Telugu Global
National

దుబాయ్‌లో రూ. 630 కోట్లతో విల్లా కొన్న ముఖేష్ అంబానీ?

విలాసవంతమైన విల్లా డీల్‌ను పూర్తి ప్రైవేటు వ్యవహారంగా పూర్తి చేసినట్లు వాళ్లు వెల్లడించారు. పామ్ జుమేరా ఉత్తర భాగంలోని బీచ్ సైడ్‌లో ఉన్న ఈ విల్లాలో 10 బెడ్ రూమ్స్‌తో పాటు ఒక స్పా, ఇండోర్-ఔట్‌డోర్ పూల్స్ ఉన్నట్లు దుబాయ్ లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

దుబాయ్‌లో రూ. 630 కోట్లతో విల్లా కొన్న ముఖేష్ అంబానీ?
X

పామ్ జుమేరా.. దుబాయ్ సమీపంలోని సముద్రంలో నిర్మించిన దీవులు. ఈత చెట్లను పోలిన ఈ కృత్రిమ దీవుల్లో అత్యంత విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన విల్లా.. పామ్ జుమేరాలోనే ఉన్నది. ఆ విల్లాను రూ. 630 కోట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ రెసిడెన్షియల్ విల్లా ప్రాపర్టీ డీల్‌లో మధ్యవర్తిత్వం వహించిన ఇద్దరు వ్యక్తులు కొనుగోలు వివరాలను బ్లూంబర్గ్ అనే సంస్థకు తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ కోసం కొనుగోలు చేసినట్లు వాళ్లు స్పష్టం చేశారు.

విలాసవంతమైన విల్లా డీల్‌ను పూర్తి ప్రైవేటు వ్యవహారంగా పూర్తి చేసినట్లు వాళ్లు వెల్లడించారు. పామ్ జుమేరా ఉత్తర భాగంలోని బీచ్ సైడ్‌లో ఉన్న ఈ విల్లాలో 10 బెడ్ రూమ్స్‌తో పాటు ఒక స్పా, ఇండోర్-ఔట్‌డోర్ పూల్స్ ఉన్నట్లు దుబాయ్ లోకల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రపంచ కుబేరులు, సెలబ్రిటీలు దుబాయ్‌ని తమ ఫేవరెట్ డెస్టినేషన్‌గా ఎంచుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వం 'గోల్డెన్ వీసా' వంటి ఆఫర్లను పెడుతుండటంతో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. ఇప్పుడు అనంత్ కోసం కొన్న విల్లాకు సమీపంలోనే బ్రిటిష్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు ఇళ్లు ఉండటం గమనార్హం.

రిలయన్స్ సంస్థను అనేక రంగాల్లో విజయవంతంగా విస్తరించిన ముఖేష్ అంబానీ త్వరలో రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తన వారసులు ఆకాశ్, ఈషా, అనంత్‌లకు పలు బాధ్యతలు అప్పగించారు. రిలయన్స్ జియోకు ఆకాశ్‌ను చైర్మన్ చేశారు. ఈ-కామర్స్, రిటైల్‌లను ఈషాకు ఇచ్చారు. అనంత్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను అప్పగించే అవకాశం ఉన్నది. పెట్రో కెమికల్ రంగానికి చెందిన వ్యాపారం కావడంతో అనంత్ కోసం దుబాయ్‌లో విల్లాను కొనుగోలు చేశారు. భవిష్యత్‌లో రిలయన్స్ పెట్రో వ్యాపారాల అవసరాల కోసం అనంత్ యూఏఈ, సౌదీ వంటి ప్రాంతాలకు ఎక్కువగా పర్యటించాల్సిన అవసరం ఉండటంతోనే ఈ విల్లా కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే యూకేలో అంబానీ ఫ్యామిలీ రూ. 600 కోట్లతో ఒక మాన్షన్‌ను కొనుగోలు చేసంది. ఈషా కోసం న్యూయార్క్‌లో కూడా అధునాతన భవంతిని కొన్నారు. ఎవరి వ్యాపారాలకు తగ్గట్లు వారి కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రాపర్టీలు కొనుగోలు చేస్తుండటం విశేషం. ఇక దుబాయ్‌లో కొన్న విల్లాలో భారీ మార్పులు చేయనున్నట్లు తెలుస్తున్నది. సెక్యూరిటీ పరంగా కూడా ఇబ్బందులు తలెత్తకుండా మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మార్పులు చేయనున్నారు. ఈ పనులను అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమళ్ నత్వానీ చూసుకోనున్నట్లు తెలుస్తున్నది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని ఇళ్లు, భవంతులు కొన్నా.. అంబానీల అధికార నివాసంగా ముంబైలోని ఆంటాలియానే ఉండబోతున్నది.

First Published:  27 Aug 2022 8:10 AM IST
Next Story