ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు.. - యూజీసీ
2022లో రూపొందించిన యూజీసీ రెగ్యులేషన్స్‌లో నంబర్ 14.. ఎంఫిల్ విషయంలో స్పష్టత ఇచ్చిందని వివరించింది. ఇకపై ఎంఫిల్ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని స్పష్టం చేసింది.
ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) డిగ్రీ విషయంలో యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) కీలక ప్రకటన వెలువరించింది. ఎంఫిల్ డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేదని తెలిపింది. అంతేకాదు.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్ అడ్మిషన్లు నిలిపివేయాలంటూ అన్ని యూనివర్సిటీలనూ యూజీసీ ఆదేశించింది. అలాగే ఈ కోర్సులో చేరవద్దని విద్యార్థులకు కూడా సూచించింది.
2022లోనే ఎంఫిల్ విషయంలో నిబంధనలు రూపొందించినట్టు యూజీసీ తెలిపింది. ఉన్నత విద్యాసంస్థలు ఈ డిగ్రీ కోర్సు అందించరాదంటూ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేసింది. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్‌లో ప్రవేశాల ప్రక్రియను పలు యూనివర్సిటీలు చేపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇందులో భాగంగా దరఖాస్తులు కూడా కోరుతున్నాయని తెలిసిందని వివరించింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు తెలిపింది.
2022లో రూపొందించిన యూజీసీ రెగ్యులేషన్స్‌లో నంబర్ 14.. ఎంఫిల్ విషయంలో స్పష్టత ఇచ్చిందని వివరించింది. ఇకపై ఎంఫిల్ అనేది గుర్తింపు పొందిన డిగ్రీ కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఫిల్‌లో ప్రవేశాల కోసం చేపడుతున్న ప్రక్రియను నిలిపివేయాలంటూ యూనివర్సిటీల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపింది. మరోవైపు విద్యార్థులు కూడా ఇందులో అడ్మిషన్ తీసుకోవద్దని యూజీసీ సెక్రటరీ మనీశ్ జోషి ఆ ప్రకటనలో సూచించారు.