Telugu Global
National

కార్పొరేట్ల ట్యాక్స్ ఎగవేతపై చర్యలేవి..?

కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నాయని, దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.

కార్పొరేట్ల ట్యాక్స్ ఎగవేతపై చర్యలేవి..?
X


కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్ ఎగవేతపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పార్లమెంట్ లో ప్రశ్నించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆయన కీలక ప్రశ్నలు సంధించారు. కొన్ని కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వానికి కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు ఎగవేస్తున్నాయని, దీన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటో వివరించాలని కోరారు విజయసాయిరెడ్డి. కార్పొరేట్ కంపెనీల ట్యాక్స్‌ లు, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లింపులో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), ఆదాయ పన్ను శాఖ.. కస్టమ్స్‌ సుంకాన్ని ఎగవేసిన పలు మొబైల్ కంపెనీలకు నోటీసులు జారీ చేశాయని, కార్పొరేట్ కంపెనీల విషయంలో ఇలాంటి చర్యలు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. కార్పొరేట్ కంపెనీలు ఎగవేసిన పన్నుల మొత్తం ఎంత ఉందనే విషయాన్ని మదింపు చేశారా అని కూడా అడిగారు. పన్నులు ఎగవేసిన తర్వాత నోటీసులు జారీ చేయడం కంటే.. నిర్ణీత సమయంలో ఆయా కంపెనీలు పన్నులు తప్పనిసరిగా చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిర్మలా సీతారామన్ సమాధానం..

విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఆయన సూచనలతో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పన్నుల ఎగవేతకు సంబంధించి వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా అంగీకరించారు. కార్పొరేట్‌ కంపెనీల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత ఏ మేరకు ఉందో ప్రభుత్వం లెక్కగట్టాల్సి ఉందని చెప్పారు.

First Published:  2 Aug 2022 11:57 AM GMT
Next Story