ఎంపీ ఇంజినీర్ రషీద్ కస్టడీ పెరోల్ తిరస్కరణ
పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడానికి కస్టడీ పెరోల్ ఇవ్వాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఢిల్లీ కోర్టు

పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడానికి కస్టడీ పెరోల్ ఇవ్వాలని జమ్మూకశ్మీర్ ఇంజినీర్ రషీద్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఎంపీ రషీద్ దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణను మార్చి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్రజిత్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. ఎంపీ అయిన రషీద్ పార్లమెంటు సమావేశాలకు హాజరై తన విధులను నిర్వహించాల్సి ఉన్నదని ఆయన తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా వాదించారు. అందుకు కస్టడీ పెరోల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం మార్చి 3న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా పిటిషన్‌ను తోసిపుచ్చింది. తీవ్రవాదులకు నిధులు సమకూర్చారని 2019 నుంచి తీహార్ జైలులో రషీద్ ఖైదీగా ఉన్నారు. జైలు నుంచే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన బారముల్లా స్థానం నుంచి ప్రస్తుత సీఎం ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఎంపీ రషీద్‌కు న్యాయస్థానం గత ఏడాది సెప్టెంబర్‌లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రచారం ముగిసిన తర్వాత అక్టోబర్ 27న ఆయన తీహార్ జైలులో లొంగిపోయారు.