హోళీ రోజు ఆ మసీదుకి ముసుగు వేస్తారు.. ఎందుకంటే..?
ఆ ప్రాంతంలో హిందువులు హోళీ రంగులు చల్లుకుంటారు, అదే సమయంలో ముస్లింలు మాత్రం ఆ పండగ రోజు మసీదుకి ముసుగు వేస్తారు.
దేశమంతా హోళీ పండగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. కులమతాలకు అతీతంగా ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. నాయకులు కూడా దేశ ప్రజలందరికీ హోళీ శుభాకాంక్షలు తెలిపారు. హోళీరోజు పొరుగు వారిని రంగుల్లో ముంచెత్తేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. రంగులతో హోళీ ఆడుకుంటున్నారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు మాత్రం హోళీ రోజు గంభీరంగా మారిపోతాయి. ఓవైపు సందడి, మరోవైపు నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది.
యూపీలోని అలీఘర్ లో ఉన్న హల్వైయాన్ మసీదు ప్రాంతం హోళీ రోజు గంభీరంగా ఉంటుంది. ఆ ప్రాంతంలో హిందువులు హోళీ రంగులు చల్లుకుంటారు, అదే సమయంలో ముస్లింలు మాత్రం ఆ పండగ రోజు మసీదుకి ముసుగు వేస్తారు. హల్వైయాన్ మసీదుని హోళీ ముందు రోజు పూర్తిగా టార్పాలిన్ పట్టలతో కప్పేసి ఉంచుతారు. రెండు రోజుల తర్వాతే వాటిని తొలగిస్తారు.
Uttar Pradesh | Halwaiyan Mosque in Aligarh covered with tarpaulin ahead of #Holi festival
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 7, 2023
It is happening for the last 4-5 years to ensure that colours don’t splash on the walls of the mosque: Haji Mohammad Iqbal, caretaker of the mosque (06.03) pic.twitter.com/KVrzVyb8pT
మసీదుపై రంగులొద్దు..
మసీదుపై రంగులు పడకూడదనే ఉద్దేశంతోటే హోళీ సందర్భంగా టార్పాలిన్ పట్టలతో కప్పేసి ఉంచుతామని చెబుతున్నారు ముస్లిం మత పెద్ద హాజీ మొహ్మద్ ఇక్బాల్. ఐదేళ్లుగా ఇలా టార్పాలిన్ పట్టలు కప్పుతున్నామని వివరించారు. ఈ ఏడాది కూడా హోళీ ముందురోజే మసీదు చుట్టూ నల్లటి టార్పాలిన్ చుట్టారు. మసీదు గోడలపై కూడా రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెబుతున్నారాయన.