Telugu Global
National

యూపీలో బురఖా గోల.. కాలేజీలో గొడవ గొడవ

మొరాదాబాద్ హిందూ కాలేజీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ కాలేజీ విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ అమలులో ఉందని, దానిని అనుసరించడానికి ఇష్టపడని వారెవరైనా కాలేజీలోకి ఎంట్రీ లేదని చెప్పారు కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏపీ సింగ్.

యూపీలో బురఖా గోల.. కాలేజీలో గొడవ గొడవ
X

ఆమధ్య కర్నాటకలోని కాలేజీల్లో హిజాబ్ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలను ధరించకూడదనే తీర్పుతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా అక్కడక్కడా హిజాబ్ ధరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా సుప్రీంతీర్పుని ఉదాహరణగా చూపిస్తూ విద్యాసంస్థల్లో నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. తాజాగా యూపీలో కూడా ఇలాంటి వివాదమే మొదలైంది.


మొరాదాబాద్ లోని హిందూ కాలేజీకి చెందిన కొంతమంది విద్యార్థినులు యూనిఫామ్ పై బురఖా ధరించి కాలేజీలోకి ప్రవేశించడం గొడవకు కారణం అయింది. బురఖా ధరించి వెళ్తున్న విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించకపోవడంతో వారు సమాజ్ వాదీ ఛత్ర సభ కార్యకర్తలను ఆశ్రయించారు. వారు కాలేజీ వద్దకు వచ్చి గొడవ చేశారు. సమాజ్ వాదీ ఛత్ర కార్యకర్తలు, కాలేజీ ప్రొఫెసర్లకు మధ్య తోపులాట జరిగింది.

మొరాదాబాద్ హిందూ కాలేజీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమ కాలేజీ విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ అమలులో ఉందని, దానిని అనుసరించడానికి ఇష్టపడని వారెవరైనా కాలేజీలోకి ఎంట్రీ లేదని చెప్పారు కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏపీ సింగ్. ఆ వీడియోపై ఇప్పుడు విమర్శలు చెలరేగాయి. డ్రెస్ కోడ్ ని ఫాలో అయినా కూడా యూనిఫామ్ పై బురఖా ధరించారన్న కారణంతో కాలేజీలోకి అనుమతివ్వడంలేదని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజీ డ్రెస్‌ కోడ్‌ లో బురఖాను కూడా చేర్చాలని, అమ్మాయిలు బురఖా ధరించి తరగతులకు హాజరయ్యేలా సహకరించాలని మెమొరాండం సమర్పించారు.

మొరాదాబాద్ కాలేజీ వివాదం ఇప్పుడు యూపీలో సంచలనంగా మారింది. కాలేజీ యాజమాన్యంపై కొంతమంది విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలు యూనిఫామ్ వేసుకుని ఆ తర్వాతే బురఖా ధరించారని, దానికి కూడా అనుమతి ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కానీ యాజమాన్యం మాత్రం యూనిఫామ్ అంటే యూనిఫామ్ మాత్రమేనని తేల్చి చెబుతోంది. గతంలో లేని కొత్త సంప్రదాయాలు ఇప్పుడెందుకని ప్రశ్నిస్తోంది. బురఖా ధరించి వచ్చినా, కాలేజీ గేటు బయటే దాన్ని తీసివేసి, యూనిఫామ్ తోనే లోపలికి రావాలని చెబుతోంది.

First Published:  19 Jan 2023 11:59 AM IST
Next Story