సిసోడియాపై మనీలాండరింగ్ కేసు.. రెండ్రోజుల్లో అరెస్ట్..?
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తోన్న మద్దతు చూసి సీబీఐపై ఒత్తిడి పెరగొచ్చని, అందుకే రెండు, మూడు రోజుల్లోనే సిసోడియాను అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు కేజ్రీవాల్.
ఎక్సైజ్ పాలసీ అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ప్రస్తుతం సీబీఐ కేసు నడుస్తోంది, ఈ కేసుతోపాటు ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనపై తాజాగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 కేసుకు సంబంధించి ఆయనపై మనీలాండరింగ్ కేసు పెట్టినట్టు అధికారికంగా ఈడీ ప్రకటించింది.
రెండ్రోజుల్లో అరెస్ట్..?
సిసోడియాని రెండురోజుల్లో అరెస్ట్ చేస్తారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ అరెస్ట్ గురించి కామెంట్ చేసింది వేరెవరో కాదు, సాక్షాత్తూ ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. సిసోడియాను 10 రోజుల్లో అరెస్టు చేయొచ్చనే సమాచారం తమ దగ్గర ఉందని, అయితే గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తోన్న మద్దతు చూసి సీబీఐపై ఒత్తిడి పెరగొచ్చని, అందుకే రెండు, మూడు రోజుల్లోనే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని అన్నారు కేజ్రీవాల్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఆప్ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు.
గుజరాత్ లో అమీ తుమీ..
ఢిల్లీ తర్వాత పంజాబ్ లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పెద్దగా టైమ్ తీసుకోలేదు, ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో బీజేపీని పడగొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గుజరాత్ లో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే కేబినెట్ మంత్రులు రాజేంద్ర త్రివేది, పూర్ణేశ్ మోదీ శాఖలను రద్దు చేసింది. మరిన్ని ప్రక్షాళనలకు కూడా ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తామంటే భయపడి గుజరాత్ బీజేపీ చీఫ్ ని కూడా అధినాయకత్వం మార్చే ప్రయత్నాల్లో ఉందని అన్నారు కేజ్రీవాల్. సీఆర్ పాటిల్ ని ఆ పదవినుంచి తొలగించబోతున్నారని చెప్పారు. గుజరాత్ లో తాము అధికారంలోకి వస్తే పోటీ పరీక్షల పేపర్లు లీక్ చేసిన వారిని పదేళ్లపాటు జైలులో వేస్తామన్నారు. కనీసం పోటీ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇక పాలన సజావుగా ఎలా సాగుతుందని ప్రశ్నించారాయన. గుజరాత్ లో ఆప్ అధికారం ఖాయమంటున్నారు కేజ్రీవాల్.