Telugu Global
National

బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో మోడీ మార్క్‌..!

బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణలో నరేంద్ర మోడీ తన మార్క్ చూపించారు. తనకు సవాల్ గా మారుతారనుకునే నాయకులను పక్కనపెట్టి తనకు జై కొట్టే నాయకులను బోర్డులోకి తీసుకున్నారు.

బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో మోడీ మార్క్‌..!
X

భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) సంస్థాగ‌త మార్పుల్లో భాగంగా పార్ల‌మెంట‌రీ బోర్డు, కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీని పున‌ర్వ్య‌వ స్థీక‌రించింది. ఈ మార్పుల్లో కొంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన నియామ‌కాలు ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వైఖ‌రి తెలిసిన వారికి మాత్రం ఇందులో వింత‌గా అనిపించ‌లేదు. మోడీ ప్ర‌ధాన మంత్రిగా, అమిత్ షా హోంమంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌నాటి నుంచే పార్టీపై సొంతంగా ప‌ట్టు బిగించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. తాము అనుకున్న‌ది సాధించే క్ర‌మంలో అడ్డు త‌గులుతార‌నుకున్న హేమాహేమీల్లాంటి నాయ‌కుల‌ను సైతం ఎంతో తేలిగ్గా ప‌క్క‌న బెట్టిన సంద‌ర్భాలు చూశాం. మోడీకి వెన్నుద‌న్నుగా నిలుస్తూ, ఎన్నో సార్లు ఆయ‌నను వెన‌కేసుకొచ్చిన గురుతుల్యుడ‌ని ప్ర‌ధాని చెప్పుకున్న సీనియ‌ర్ నాయ‌కుడు ఎల్ కె అద్వానీనే ప‌క్క‌న‌బెట్టారు. అలాగే ముర‌ళీమ‌నోహ‌ర్ జోషి వంటి నేత‌ల‌ను అస‌లు ప‌ట్టించుకోనే లేదు. తాజాగా జ‌రిగిన పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ లో కూడా.. ఎనిమిదేళ్ళ‌గా అధికారంలో ఉన్న మోడీ, షా ద్వ‌యం త‌మ మార్కును మ‌రోసారి చూపెట్టింది.

ఈ ప్ర‌క్రియ లో ప‌లు స‌మీక‌ర‌ణ‌లు, వ్యూహాలు ఉన్నాయ‌ని పైకి చెబుతున్న‌ప్ప‌టికీ త‌మ‌కు స‌వాలుగా మారే అవ‌కాశం ఉంద‌నుకున్న నాయ‌కుల‌ను ప‌క్క‌న‌బెట్టార‌నే స్ప‌ష్ట‌మ‌వుతోంది. పార్టీ,పాల‌నా విష‌యాల్లో స్వ‌తంత్రంగా వ్య‌వ‌హరిస్తార‌నే పేరు ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రి, మ‌ద్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ వంటి సీనియ‌ర్ నాయ‌కుల‌తో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య నాథ్ కు కూడా పార్ల‌మెంట‌రీ బోర్డులో చోటు క‌ల్పించ‌లేదు. స్వ‌తంత్ర వైఖ‌రితో పాటు ఆర్ ఎస్ఎస్ ఆశీస్సులు కూడా పుష్క‌లంగా గ‌డ్క‌రీకి ఉన్నాయి. చాలా సంద‌ర్భాల్లో ఈ సంస్థ కూడా మోడీ నిర్ణ‌యాల‌కు అడ్డుత‌గిలే ప్ర‌య‌త్నాలు చేసినా ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ప‌ట్టువిడుపులుగా వ్య‌వ‌హ‌రించాల్సి వ‌చ్చింది.

వాస్త‌వానికి గ‌డ్క‌రీ, చౌహాన్ ఇద్ద‌రూ మోడీ, షా కంటే ముందుగానే పార్ల‌మెంట‌రీ బోర్డులో స‌భ్యులుగా ఉన్నారు. ఇంకా విచిత్ర‌మేమిటంటే పార్టీ మాజీ అధ్య‌క్షులు పార్ల‌మెంట‌రీ బోర్డులో ఎక్స్‌-అఫిషియో స‌భ్యులుగా ఉంటారు. గ‌డ్క‌రీ పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ప‌ని చేసిన విష‌యం తెలిసిందే. అయితే వాజ‌పేయి, అద్వానీ లు కూడా బోర్డు నుంచి త‌ప్పుకోగా వారిని మార్గ‌ద‌ర్శ‌క మండ‌లిలో అవ‌కాశం క‌ల్పించారు.

వ‌యో ప‌రిమితులు..

మోడీ షా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వ‌యో ప‌రిమితుల నియ‌మం పెట్టారు. ఇక జాతీయ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ముర‌ళీ మ‌నోహ‌ర జోషి 80యేళ్లు రావడంతో పార్ల‌మెంటు బోర్డు నుంచి త‌ప్పుకున్నారు. మ‌ళ్ళీ తాజా నియామ‌కాల‌కు వ‌స్తే.. 79 యేళ్ళ వ‌య‌సు ఉన్న క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి యెడ్యూర‌ప్ప‌ను ప‌ద‌విలోకి తీసుకున్నారు. ఆయ‌న్ను చేర్చుకోవ‌డంలో రెండు కార‌ణాలు చెబుతున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకోవ‌డం ఒక‌టి కాగా వ‌చ్చే యేడాది ఆ రాష్ట్రంలో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న సామాజిక లింగాయ‌త్ వ‌ర్గాన్ని సంతృప్తి ప‌రిచేందుకు అని చెబుతున్నారు. అలాగే మ‌రో సీనియ‌ర్ నేత 71 యేళ్ళ రాజ్ నాథ్ సింగ్ ను కూడా చేర్చుకున్నారు. విశేష‌మేంటంటే.. రాజ్ నాథ్ సింగ్ 2006-09 మ‌ధ్య కాలంలో పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్నస‌మ‌యంలో న‌రేంద్ర మోడీని పార్ల‌మెంట‌రీ బోర్డు నుంచి తొల‌గించారు. అయినా రాజ్ నాథ్ ను కొన‌సాగించ‌డం విశేషం.

గ‌డ్క‌రీని ఎందుకు తొల‌గించాల్సి వ‌చ్చింది.. ?

ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన మ‌రో విష‌యం నితిన్ గ‌డ్క‌రీ వ‌య‌సు కేవ‌లం 65యేళ్ళే. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను తొల‌గించ‌డం వెన‌క ముఖ్యంగా మూడు కార‌ణాలు క‌న‌బ‌డుతున్నాయి. గ‌డ్క‌రీ సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునే త‌త్వం ఉన్న వ్య‌క్తి. ఆయ‌న నిర్వ‌హించిన ప‌ద‌వుల‌లో త‌న‌దైన మార్కు వేస్తూ పాల‌నా ప‌రంగా స‌మ‌ర్ధుడ‌నే పేరు సంపాదించుకున్నారు. మిగిలిన మంత్రులంద‌రి కంటే పిఎంఓ ప్ర‌మేయం లేకుండా స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించేవాడు. నాగ‌పూర్ బ్రాహ్మ‌ణుడైన గ‌డ్క‌రీ అంటే ఆర్ ఎస్ఎస్ కు చాలా అభిమానం. వారి ఆశీస్సుల‌తోనే ఆయ‌న 2009 లో పార్టీ జాతీయ అద్య‌క్షుడు కాగ‌లిగాడు. ఆయ‌నకు మితవాది అనే ఇమేజ్ ఉంది. మతపరమైన ప్రకటనలకు దూరంగా ఉన్నాడు. అయితే, ఆయన సొంత పార్టీపైనే విమర్శలు చేసిన విష‌యం తెలిసిందే. 'అధికారంలో కొనసాగడమే రాజకీయంగా మారిపోయింది' అని ఇటీవల ఆయన ఓ వ్యాఖ్య సంచ‌ల‌నం రేపింది. అంతకుముందు కూడా ఆయన ఒక మరాఠీ ఇంటర్వ్యూలో "భాజపా ఇంత పెద్ద మెజారిటీ సాధిస్తుందని ఊహించలేదు కాబట్టి అన్ని రకాల వాగ్దానాలు చేసింది" అని చమత్కరించారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ ను ఎందుకు తొల‌గించారు?

శివరాజ్ సింగ్ చౌహాన్‌ 2013లో మోడీతో పాటు పార్లమెంటరీ బోర్డులో చేరారు. 2011-12 మ‌ద్య‌ కాలంలో చౌహాన్ తరచుగా మోడీకి ధీటైన వ్య‌క్తిగా (కౌంటర్ వెయిట్‌) ప్రచారం పొందారు. 2012లో బీజేపీ సమావేశంలో ఎల్‌కే అద్వానీ శివరాజ్ చౌహాన్ ప‌ని తీరును ప్రశంసించ‌డంతో మోడీ ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నంగా భావించారు మోడీ. అంటే మోడీ ఎంత సునిశితంగా ఇటువంటి విష‌యాలు ప‌ట్టించుకుని స‌మ‌యం కోసం ఎదురు చేస్తార‌నే దానికి నిద‌ర్శ‌న‌మే ప్ర‌స్తుత ఆయ‌న చ‌ర్య‌లు.

మోడీ ప్రధాని కాకముందు నుంచీ అధికారంలో ఉన్న ఏకైక బీజేపీ సీఎం చౌహాన్ మాత్రమే. మిగతా వారంతా మోడీ, షా ఆశీస్సులతోనే సీఎంలు అయ్యారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఆయన మోడీ, షాల ప్రాపకంతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ ఉంది. అంతకుముందు మితవాదిగా భావించిన ఆయన, 'కొత్త బిజెపి'లో నిల‌దొక్కుకునేందుకు ప్రస్తుత పదవీకాలంలో మరింత ఎక్కువగా హిందుత్వ అనుకూల వ్యక్తిగా కనిపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఆయ‌న గ‌త భావ‌జాలానికిదూరంగా జ‌రిగిన‌ట్టు క‌న‌బ‌డుతుంది. అయితే ఆ రాష్ట్రంలో చౌహాన్ కు ధీటుగా మ‌రో వ్య‌క్తిని త‌యారు చేయ‌డంలో మోడీ షా పూర్తిగా స‌ఫ‌లీకృతం కాలేక‌పోయార‌నేది నిర్వివాదం. అందుకే చౌహాన్ కంటే స‌త్య‌నారాయ‌ణ జ‌తియాను ప్రాధాన్యంగా మోడీ షా ఎంచుకున్నారు.

యోగిని ఎందుకు తీసుకోలేదు..?

మోడీ, షా తర్వాత బీజేపీలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడుగా యోగి ఆదిత్యనాథ్ పేరు పొందార‌ని చెబుతారు. ఆయ‌న్ను పార్ల‌మెంట‌రీ బోర్డులో కి తీసుకోక‌పోవ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌లేదు. ఇత‌ర సీఎంల కంటే ఆయ‌న ప్రాధాన్య స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో మోడీ, అమిత్ షాల‌కు స‌వాలుగా ఎదుగుతార‌నే ప్ర‌చారం కూడా యోగి ని ప‌క్క‌న‌ బెట్ట‌డానికి కార‌ణాల‌లో ఒక‌టి. అంతేగాక , యుపిలోని ఠాకూర్ రాజకీయాల్లో యోగి ప్రత్యర్థిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటరీ బోర్డులో కొనసాగ‌డం ఆస‌క్తిక‌రం.

తాజా పార్లమెంటరీ బోర్డులో ముఖ‌మంత్రులు ఎవ‌రూ లేరు. అయితే 2013 ప్రాంతాల్లో బిజెపి సమాఖ్య తత్వానికి మొగ్గు చూపుతుందని, చాలా రాష్ట్రాలలో పార్టీ బ‌లంగా ఉందని న‌మ్మించేందుకు బిజెపి మోడీ, చౌహాన్‌లను బోర్డులో చేర్చుకుంది. కాలానుగుణంగా వ‌చ్చిన మార్పుల మేర‌కు చౌహాన్‌ను తొలగించడం, యోగిని చేర్చుకోకపోవడంతో బీజేపీ నాయకత్వం స‌మాఖ్య స్ఫూర్తి కి దూర‌మ‌వుతూ మరింత కేంద్రీకరణ దిశగా పయనిస్టున్న‌ట్టుగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకోస‌మే ప‌లు రాష్ట్రాల నుంచి బిజెపి స‌మాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంద‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది.

First Published:  18 Aug 2022 1:12 PM IST
Next Story