Telugu Global
National

కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్‌ కాదు.. ఎన్డీఏ సర్కార్‌

ఎంవీఏ ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తూ.. ఎన్డీఏ కూటమిపై ఉద్ధవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్‌ కాదు.. ఎన్డీఏ సర్కార్‌
X

ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్‌ కాదని, ఎన్డీఏ సర్కార్‌ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఇది ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో వేచి చూడాలని ఆయన చెప్పారు. శనివారం ముంబయిలో కూటమి నేతలతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్ధవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అధికార కూటమితో పోలిస్తే మహా వికాస్‌ అఘాడి (ఎంవీయే) లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తమ విజయంపై స్పందించారు. ఇది ఎంవీఏకు అంతిమ విజయం కాదని వ్యాఖ్యానించారు. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైందని, రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోందని చెప్పారు.

బీజేపీని ఎవరూ ఓడించలేరని ఊహించారని, కానీ ఆ భావనను సవాల్‌ చేయడంలో మహారాష్ట్ర ప్రజలు కీలకపాత్ర పోషించారని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. గతంలో ఎంవీఏ ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ వ్యాఖ్యానించడాన్ని గుర్తు చేస్తూ.. ఎన్డీఏ కూటమిపై ఉద్ధవ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడి.. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ఠాక్రే ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు పార్టీని విడిచి మళ్లీ ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నవారికి తమ పార్టీలో చోటు లేదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎంవీఏ అధికారంలోకి వస్తుందని, అందుకు సమష్టి కృషి ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు.

First Published:  16 Jun 2024 7:16 AM IST
Next Story