కలియుగ రావణుడు.. మోడీ..! కాంగ్రెస్ వ్యంగ్య వీడియో
కాంగ్రెస్ పార్టీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రధాని నరేంద్ర మోడీని రావణాసురుడి తో పోలుస్తూ నిమిషం నిడివిగల ఓ సెటైరికల్ వీడియోను పోస్ట్ చేసింది. 'కలియుగంలో రావణుడు మంచి మనిషిగా నటిస్తూ వస్తాడు’. అంటూ కథనం సాగుతుంది.
భారతదేశం అంతటా రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయడంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. భారత్ జోడో యాత్ర కు వస్తోన్న ప్రజాదరణతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. దాంతో ఇప్పుడు ఇక కాంగ్రెస్ "రామాయణ రాజకీయాల" వైపు అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రధాని నరేంద్ర మోడీపై వ్యంగ్యాస్త్రాలు వేస్తూ, రావణాసురుడి తో పోలుస్తూ నిమిషం నిడివిగల ఓ సెటైరికల్ వీడియోను పోస్ట్ చేసింది. మోడీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ చేసిన ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో 'ఈ దేశ రాజకీయాలకు మీరు కావాలి' అనే లైన్‌తో ప్రారంభమవుతుండగా నవ్వుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్నట్టు కనబడుతుంది. వీడియో సాగుతుండగానే మోడీ ఫ్రేమ్‌లోకి ప్రవేశిస్తారు. అప్పుడు.., 'కలియుగంలో, రావణుడు మంచి మనిషిగా నటిస్తూ వస్తాడు'. అంటూ కథనం సాగుతుంది.
రాహుల్, మోడీల మధ్య వ్యత్యాసాన్ని చూపించే ప్రయత్నంలో, భారత రాజకీయాల్లో రాహుల్ గాంధీ అవసరం ఇప్పుడు ఎంతో ఉందని వీడియోలో ప్రొజెక్ట్ చేస్తుంది. అతను పిల్లలతో ఆడుకోవడం, మహిళలతో నడుస్తూ ముచ్చటించడం, ప్రజలను కలుసుకోవడం వంటివి వీడియో చూపిస్తుంది.
సోషల్ మీడియాలో వరుస వీడియోలు, ట్వీట్‌లను పోస్ట్ చేయడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ బ్రాండ్ ఇమేజ్ ని భారత్ జోడో యాత్ర ద్వారా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. రాహుల్ రాజకుమారుడని, ప్రజలకు అందుబాటులో ఉండడని ప్రత్యర్ధులు చేసే విమర్శలను తిప్పికొట్టేలా ఈ యాత్రా విశేషాలను ప్రజలతో మమేకమయ్యే తీరును ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
అయితే గత కొన్ని రోజులుగా రామాయణం రాజకీయ చర్చల్లో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. సోమవారం, కాంగ్రెస్ నాయకుడు,రాజస్థాన్ మంత్రి పార్సాది లాల్ మీనా, రాహుల్ భారత్ జోడో యాత్రను అయోధ్య నుండి లంక వరకు శ్రీరాముడి ప్రయాణంతో పోల్చారు. ''రాహుల్ గాంధీ పాదయాత్ర చరిత్రాత్మకం. రాముడు కూడా కాలినడకన అయోధ్య నుండి శ్రీలంకకు వెళ్ళాడు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అంతకంటే ఎక్కువగా నడుస్తున్నారు' అని మీనా అన్నారు.
మీనా చెప్పిన పోలికను మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సమర్ధించారు. అయితే "రామ్ , రాహుల్ గాంధీల పేర్లు ' ఆర్' అక్షరంతోనే ప్రారంభం కావడం యాదృచ్ఛికం" అని అన్నారు. రాముడు, రాహుల్‌లను పోల్చలేమని ఆయన అన్నారు. "రాముడు దేవుడు, రాహుల్ గాంధీ మానవుడు. "అన్నారు.
అయితే పటోల్ వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగింది. బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కాంగ్రెస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. "రావణ్ కూడా ఆర్ అక్షరంతోనే మొదలవుతుంది". అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.