Telugu Global
National

ప్రధానమంత్రి "అభాసు"యోజన

రాజకీయాలు వేగంగా పరుగుపెడ్తాయి. రాజకీయ నాయకుల వేగంతో సామాన్యులు పోటీపడలేరు. మోదీ హయాంలో సామాన్యులు చేయగలిగిన పని ఒకటి ఉంది. ఆయన వాగ్దానాలను వీలైనంత త్వరగామరిచిపోవడమే. ప్రధానమంత్రి ఆవాసు యోజన చివరకు అభాసు యోజనగా మిగిలిపోయింది.

X

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలలు కనడంలో దిట్ట. ఆ కలల్లో పగలే వెన్నెలకాస్తుంది. జగమంతా ఊయల లుఊగుతూ ఉంటుంది. ఆ కలలను కమనీయంగా వర్ణించి చెప్పడంలో కూడా మోదీ నిష్ణాతుడు. ఆ కలలే వాగ్దానాల రూపం సంతరించుకుంటాయి. "దేశం స్వతంత్రమై 2022లో 75 ఏళ్లు అవుతుంది. అప్పటికల్లా ఒక్కకుటుంబం కూడా సొంత పక్కా ఇల్లు లేకుండా ఉండకూడదు. కాంగ్రెస్‌లా కాదు. ఇల్లంటే నాలుగు గోడలు కాదు. మోదీ ప్రధాన‌మంత్రి ఆవాస్ యోజన అమలు చేస్తే పక్కా ఇల్లు, పక్కాపైకప్పు, ఇంట్లో కుళాయి, ఆ కుళాయిలో నీళ్లు, వండుకోవడానికి గ్యాస్, ఎల్.ఈ.డి. బల్బు, మరుగుదొడ్డి-ఇలాంటి అన్ని వసతులు ఉండే పక్కా ఇల్లు - ఇదీ నాకల" అన్నారు 2015లో మోదీ ప్రధాన‌మంత్రి ఆవాస్యోజన ప్రారంభించేప్పుడు.


ఇంకో వారం రోజుల్లో 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి సంసిద్ధమవుతున్నాం. ప్రధాన మంత్రి ఈదేశ ప్రజల కోసం కలగన్నారు. ఆ కలను వాగ్దానంగా మార్చారు. ఆయన కల ఏమేరకు నెరవేరిందో బేరీజు వేసిచూడడం అవసరం. ఈఏడేళ్ల కాలంలో రాజకీయాధికారం వేగంగా పరుగెత్తిందా లేక మోదీ కలలు అత్యంత వేగంగా వాస్తవ రూపం దాల్చాయా అని అంచనా వేయాలి. ఆయన కల 50 శాతం అయినా నెరవేరిందా? ఒక్కో రాష్ట్రంలో ప్రధాన‌మంత్రి ఆవాస్యోజన కాళ్లీడ్చినా, చేసిన వాగ్దానంలో 50 శాతం కూడా నెరవేరకపోయినా బీజేపీ మాత్రం అత్యంత సంపన్నమైన పార్టీగా మారింది. మరి ఆ పార్టీకి ప్రతి జిల్లాలో సొంత పార్టీ కార్యాలయాలు ఉండాలిగా. పేదరికం, అణగారినతనం, గూడులేక అవస్థలు పడేవారి సంఖ్య పెరిగినా బీజేపీ కార్యాలయాల నిర్మాణం దాదాపు పూర్తి అయిపోయింది. అంతో ఇంతో పనులు మిగిలిఉన్న చోట నిర్మాణ కార్యకలాపాలు శరవేగంతో సాగుతున్నాయి. ప్రజల తలమీద గూడు అన్న మోదీకల మాత్రం ఇప్పటికీ చాలా చోట్ల కలగానే ఉండి పోయింది. బీజేపీ తన లక్ష్యాలు సాధిస్తోందా లేక దేశప్రజలకోసం నిర్దేశించిన లక్ష్యాలు సాధించడంలో ఏమేరకు విజయవంతమైందో అంచనా వేయాలి. దేశంలో 773 జిల్లాలుఉన్నాయి. వచ్చే ఏడాది కల్లా ప్రతిజిల్లాలోనూ బీజేపీ కార్యాలయాల నిర్మాణం పూర్తి కావడం ఖాయం. ఇప్పటికే 215 కార్యాలయాలు సిద్ధమైపోయాయి. మరో 500 కార్యాలయాల నిర్మాణం అంత్య దశల్లో ఉంది.

ప్రధాన మంత్రి ఆవాస్యోజన కింద ఇళ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాలకన్నా పట్టణప్రాంతాల్లోనే అధికంగా ఉంది. బిహార్లో 38 జిల్లాల్లో పట్టణ ప్రాంతాల్లో 15 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటే 3,12,000 ఇళ్లే నిర్మించగలిగారు. అంటే దాదాపు 20 శాతం లక్ష్యం మాత్రమే పూర్తి అయింది. ఉత్తరప్రదేశ్లో 60 లక్షల ఇళ్లు కట్టాలనుకుంటే 15,73,000 ఇళ్ల నిర్మాణమే పూర్తి అయింది. అంటే 26-27 శాతం లక్ష్యమే నెరవేరింది. మధ్యప్రదేశ్లో 16,50,000 ఇళ్లు సిద్ధం కావాలనుకుంటే 7, 84,000 ఇళ్లే కట్టగలిగారు. అంటే 40 లక్ష్యం పూర్తి అయింది. హర్యానాలో 22 లక్షల ఇళ్ల నిర్మాణం తలపెడ్తే 2,66,000 ఇళ్లే కట్టగలిగారు. అంటే 8 శాతమే లక్ష్యం పూర్తి అయింది. అస్సాంలో ఏడున్నర లక్షల ఇళ్లు కట్టాలని సంకల్పిస్తే 1,17,000 ఇళ్ల నిర్మాణమే సాధ్యమైంది.

ఈలోగా 2019 సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చాయి. బీజేపీ అధికారంలో లేని బెంగాల్, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ఇళ్ల నిర్మాణం కాస్తంత వేగంగానే జరిగింది. బెంగాల్లో 8,50,000 ఇళ్లు నిర్మించాలనుకుంటే 4,00,000 ఇళ్లు నిర్మించగలిగారు. అంటే 46 శాతం లక్ష్యం సాధించగలిగారు. అలాగే తెలంగాణలో 5,00,000 ఇళ్లు నిర్మించాలనుకుంటే 2,16,000 ఇళ్లు కట్టడం సాధ్యమైంది. అంటే లక్ష్యంలో 45 శాతం సాధించినట్టే. మహారాష్ట్రలో 45,00,000 ఇళ్లు కట్టాలనుకుంటే 11, 72,000 ఇళ్లు పూర్తి అయినాయి. జార్ఖండ్లో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకుంటే 1,98,000 అంటే 38 శాతం లక్ష్య సాధన సాధ్యమైంది. పంజాబ్లో 3,60,000 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంటే 90,000 ఇళ్లే కట్టగలిగారు. రాజస్థాన్లో ఆరున్నర లక్షల ఇళ్లు కట్టాలనుకుంటే రెండు లక్షలే కట్టగలిగారు.

మోదీ వాగ్దానం చేసిన రీతిలో కాకుండా ఇదేవేగంతో ఇళ్ల నిర్మాణం కొనసాగితే అందరికీ ఇళ్లు అందడానికి 2035 దాకా వేచిచూడాల్సిందే. అంటే మోదీ వాగ్దానం వాస్తవం కావడం మరో 13 ఏళ్లకు గానీ సాధ్యం కాదు. ఈ లోగా ఇళ్లు అవసరమయ్యే వారి సంఖ్యను మినహాయిస్తేనే ఇదీ పరిస్థితి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం రూ. 8,31,000 కోట్లుకేటాయించారు. ఇందులో రూ. 1,20,000 విడుదల చేశారు. మరో 2,03,000 కోట్లు కేటాయిస్తామని వాగ్దానం చేశారు.

మరుగుదొడ్లే మెరుగు

మరుగు దొడ్ల నిర్మాణం కాస్త మెరుగ్గా ఉంది. 98 శాతం మందికి ఇప్పుడు మరుగుదొడ్లు ఉన్నాయని అంచనా. అయితే ఇవి గ్రామాల్లోనే ఎక్కువ నిర్మించారు. వెనుకబడిన రాష్ట్రం అనుకునే బిహార్లోనూ బీజేపీ ఆఫీసులు దండిగానే వచ్చాయి. బీజేపీ కార్యాలయాలు నిర్మించిన ప్రాంతాలలో వెనుకబాటు తనం మాత్రం పదిలంగానే ఉంది. ఇంటింటికి విద్యుత్తు కూడా సరఫరా చేస్తామన్నది మోదీ వాగ్దానం. విచిత్రం ఏమిటంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న సందర్భంలోనే ఒడిశాలోని ఆమె స్వగ్రామంలో విద్యుత్ స‌రఫరా లేదని తేలింది. విద్యుత్ స‌రఫరా లేని 18000 గ్రామాలకు నిర్దేశించిన లక్ష్యం కన్నా ముందే విద్యుత్ స‌రఫరా అందించగలిగామని మోదీ అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉంటారు. మరి ఆ గ్రామాల జాబితాలోంచి ముర్ము స్వగ్రామం ఎలా జారిపోయిందో. హడావుడిగా ముర్ము గ్రామంలో విద్యుత్ స్తంభాలు లేచాయి. విద్యుత్ తీగ‌లు అమరాయి. విద్యుత్ దీపాలు వేలిగాయి. ముర్ము ఆగ్రామానికి చెందినవారు కాకపోతే విద్యుత్ స‌రఫరా అందడానికి మరింకెన్నాళ్లుపట్టేదో!

మోదీ వాగ్దానం చేసినట్టు అవసరమైన వారికి 2022 మందికి ఇళ్లు సమకూరింది గుజరాత్, హిమాచల్ ప్ర‌దేశ్, పంజాబ్, జమ్మూ-కశ్మీర్లో సగటున 38 శాతం మందికే. అక్కడ కుళాయిలు, వాటిలో నీరు, గ్యాస్సిలిండర్, విద్యుత్సరఫరా, మరుగుదొడ్లు లాంటివి సమకూరాయి. ఛత్తీస్గఢ్, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్నాటకలో నిర్మించిన ఇళ్లల్లో కూడా సదుపాయాలన్ని కల్పించడం 2023 నాటికి ఏడు శాతంఇళ్లకే సాధ్యం అవుతుందట. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, జార్ఖండ్, ఒడిశాలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన మేరకు సదుపాయాలు 2024 లోగా సమకూరే అవకాశం లేదు.

ఖాళీ సిలిండర్లు

ఉజ్వల పథకం కింద 13 కోట్ల గృహిణులకు ఉచితంగా వంటగ్యాస్ క‌నెక్షన్లు అందించిన మాట వాస్తవమే. ఇక్కడ ఉచితం అంటే వంట గ్యాస్ క‌నెక్షన్ తీసుకోవ‌డానికి చెల్లించవలసిన మొత్తం ఉజ్వల పథకం కిందకు వచ్చే వారికే. అయితే ఆ తరవాత గ్యాస్సిలిండర్ ఉచితంగా ఇవ్వరు. డబ్బిచ్చి కొనుక్కోవాలి. ఇందులో 4 కోట్ల 13 లక్షల మందికి ఉచితంగా అందిన సిలిండర్ వాడుకున్నారు తప్ప రెండోసారి సిలిండర్ కొనే స్తోమత వారికి లేదు. అందువల్ల ఖాళీ సిలిండర్ అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. ఏడుకోట్ల 66 లక్షల మంది 2017 తరవాత ఒక్కసారే సిలిండర్ సొంత డబ్బుతో కొనుక్కోగలిగారు. ఇప్పుడు గ్యాస్ సిలిండ‌ర్ భ‌రించలేనంత భారం అయింది కనక అవన్నీఖాళీగా మిగిలిపోవలసిందే.

రాజకీయాలు వేగంగా పరుగుపెడ్తాయి. రాజకీయ నాయకుల వేగంతో సామాన్యులు పోటీపడలేరు. మోదీ హయాంలో సామాన్యులు చేయగలిగిన పని ఒకటి ఉంది. ఆయన వాగ్దానాలను వీలైనంత త్వరగామరిచిపోవడమే. ప్రధానమంత్రి ఆవాసు యోజన చివరకు అభాసు యోజనగా మిగిలిపోయింది.

First Published:  9 Aug 2022 6:15 PM IST
Next Story