Telugu Global
National

త్వరలోనే వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయనున్న మోదీ సర్కార్?

పేదప్రజలకందించే వంటగ్యాస్ సబ్సిడీని ఎత్తేయాలని మోదీ సర్కార్ ప్రణాళిక సిద్దం చేసింది. సబ్సిడీలు ఉచితాలు దేశ భవిష్యత్తుకు మంచిది కాదని చెప్తున్న మోదీ ఒక్కొక్క సబ్సిడీ ఎత్తేస్తున్నారు.

త్వరలోనే వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయనున్న మోదీ సర్కార్?
X

ప్రజలకు ఉచితాలు ఇవ్వొదంటూ ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే రాష్ట్రాలకు హితవు పలుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలకు ఇచ్చే వంటగ్యాస్ సబ్సిడీ పూర్తిగా ఎత్తివేయాలనే ఆలోచనలో మోదీ ప్రభుత్వం ఉంది.

కఠినమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా వృద్ధి, ఆదాయాలు దెబ్బతినడంతో ప్రభుత్వం తన వ్యయాన్ని అరికట్టడానికి, ఆర్థిక లోటును నియంత్రించడానికి ఈ సబ్సిడీని నిలిపివేద్దామని నిర్ణయించుకుందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ది ప్రింట్ ప్రతినిధితో చెప్పారు.

పెట్రోలియం ఉత్పత్తులను సబ్సిడీ ధరలకు విక్రయించడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం బిల్లును చెల్లించడం కష్టంగా మారిందని ఆ అధికారి తెలిపారు.

"సబ్సిడీ మొత్తం తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం ప్రభుత్వ వ్యయాన్ని హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యం. అందుకే పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది.'' అని ఆయన తెలిపారు.

2022-23 బడ్జెట్‌లో కేంద్రం పహల్ (ఎల్‌పిజి వినియోగదారునికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ)పథకం కింద రూ.800 కోట్లు కేటాయించింది. అయితే, ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం LPG సబ్సిడీ రూ. 5,812 కోట్లు, ఇందులో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలకు పంపిణీ చేయబడిన ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి.

డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపుతో ప్రభుత్వ ఆదాయాలు దెబ్బతినడంతో, స్థూల ఆర్థిక లోటు పెరిగే ప్రమాదం ఏర్పడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మే నెలవారీ ఆర్థిక సమీక్ష నివేదికలో పేర్కొంది.

PAHAL (ఎల్‌పిజి వినియోగదారునికి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ)పథకం మొదటిసారిగా యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వంలో 2013లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద, వినియోగదారులు LPG సిలిండర్ కు మార్కెట్ ధరను చెల్లిస్తారు. ఆతర్వాత‌ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ప్రకారం, ఢిల్లీలోని వినియోగదారులు ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్‌కు రూ.1,053 చెల్లిస్తున్నారు. 2020లో, ఢిల్లీ వినియోగదారులకు సబ్సిడీ మొత్తాన్ని సిలిండర్‌కు రూ.291గా నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. చాలా మంది వినియోగదారులు స్వచ్చందంగా తమ సబ్సిడీని వదులుకున్నారు.

గత ఏడాది ఫిబ్రవరిలో, కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో, 1 ఫిబ్రవరి 2021 నాటికి 1.08 కోట్ల ఎల్‌పిజి వినియోగదారులు తమ సబ్సిడీని వదులుకున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై పడే సబ్సిడీ భారంపై వినియోగదారులకు అవగాహన లేకపోవడమే కాకుండా, మార్కెట్ ధర కంటే తక్కువ ధర కలిగిన దేశీయ సబ్సిడీ ఎల్‌పిజిని వాణిజ్య ప్రయోజనాల కోసం మళ్లించడం వల్ల ఈ పథకం ఖజానాపై భారంగా మారిందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

జూన్‌లో, పెట్రోలియం కార్యదర్శి పంకజ్ జైన్ మాట్లాడుతూ జూన్ 2020 నుండి వంట గ్యాస్ ఖాతాపై ఎటువంటి సబ్సిడీని చెల్లించలేదని, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద మాత్రమే సిలిండర్‌కు 200 రూపాయలు సబ్సిడీ అందించబడుతుందని చెప్పారు.

అదే నెలలో చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ " సబ్సిడీలు ఎల్లకాలం కొనసాగించడానికి, పెంచుకుంటూ పోవడానికి రూపొందించలేదు. ఇకపై మేము సబ్సిడీలను తగ్గిస్తూ వస్తాం'' అన్నారు.

మంత్రులు, అధికారులందరి మాటలకు అర్దం ఒకటే త్వరలోనే వంట గ్యాస్ పై పేదలకిచ్చే సబ్సిడీని కేంద్రం ఎత్తేయదల్చుకుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ల పై సబ్సీడీలు ఎత్తేసింది. వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక గ్యాస్ కూడా అదే దారిలో నడవనుంది.

ఇలా సబ్సిడీలను ఎత్తేసి, ఉచితాలంటేనే దేశద్రోహమన్నట్టు ప్రచారం చేస్తున్న మోదీ ప్రభుత్వం పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేయడం, వారి వ్యాపారాభివృద్దికి ఉచిత తాయిలాలు ప్రకటించడం, వారికి అన్ని రకాల సహాయసహకారాలు అందించడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి ?

First Published:  2 Aug 2022 5:12 AM GMT
Next Story