Telugu Global
National

రైతులపై మోదీకి ఎందుకింత కక్ష..?

కేంద్రం నిరంకుశ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతన్నలు. మోదీ తమను మోసం చేశారని అంటున్నారు. ఈ నెల 24న అంబాలాలో నిరసనలు చేపట్టి రైల్‌ రోకో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.

రైతులపై మోదీకి ఎందుకింత కక్ష..?
X

రైతు చట్టాలను కేంద్రం వెనక్కు తీసుకుంది. ప్రధాని మోదీ క్షమాపణ కూడా చెప్పారు. అంటే ఆ చట్టాలు తీసుకొచ్చి కేంద్రం తప్పు చేసిందనే అర్థం. ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటూ రైతులు చేసిన పోరాటం సరైనదేనని ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే లెక్క. మరి న్యాయపోరాటంపై కక్ష సాధింపు ఎందుకు. న్యాయం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న రైతులపై ఇంకా కేసులు ఎందుకు ఎత్తేయలేదు. పాస్ పోర్ట్, ఇత‌రత్రా అర్హ‌తల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఆ పాత కేసుల్ని సాకుగా చూపిస్తూ పోలీసులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. అసలు రైతులపై మోదీకి ఎందుకింత కక్ష..?

ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చాలా తప్పులు చేశారు. కానీ బహిరంగంగా ఆ తప్పుకి ఆయన క్షమాపణ చెప్పింది మాత్రం ఒక్క సాగు చట్టాల విషయంలోనే. కార్పొరేట్లకు అనుకూలించే సాగు చట్టాలతో రైతుల మెడకు ఉరితాడు బిగించాలని చూసింది కేంద్రం. కానీ రైతులు పోరాట పంథా ఎంచుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో టెంట్లు వేసుకుని మరీ పోరాటం సాగించారు. చివరకు సుప్రీంకోట్లు చీవాట్లు, అంతర్జాతీయ సమాజంలో అవమానాలు ఎదురయ్యే పరిస్థితి రావడంతో మోదీ వెనక్కి తగ్గారు. సాగు చట్టాలపై లెంపలు వేసుకుని వాటిని వెనక్కి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన ఓ కీలక ప్రకటన కూడా చేశారు. సాగు చట్టాల రద్దుకోసం అన్నదాతలు చేసిన పోరాటంలో వారిపై నమోదైన కేసులు బేషరతుగా ఎత్తివేస్తామని ప్రకటించారు. కాస్తో కూస్తో రైతన్నల్లో ఉన్న కోపం తగ్గించాలని చూశారు. అప్పటికప్పుడు హామీ ఇచ్చారు కానీ ఏడాది అవుతున్నా అది నెరవేరకపోవడం దారుణం.

ఏడాదిన్నరపాటు జరిగిన రైతు పోరాటంలో వారిపై 12 ఎఫ్‌.ఐ.ఆర్.లు నమోదయ్యాయి. హర్యానాలోని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పెట్టిన ఓ కేసు ఇంకా అలాగే ఉంది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న అన్నదాతలు ఇంకా చిక్కుల్లోనే ఉన్నారు. మరో 20 కేసులు కూడా పోలీసులు వెనక్కి తీసుకోలేదు. రైతు నేత రాకేశ్‌ బాయిన్స్‌ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ విషయం బయటపడింది. దీంతో రైతు సంఘాల నేతలు మరోసారి భగ్గుమన్నారు. కేంద్రం నిరంకుశ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ తమను మోసం చేశారని అంటున్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 24న అంబాలాలో నిరసనలు చేపట్టి రైల్‌ రోకో నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. గతేడాది నవంబర్ 19న సాగు చట్టాలను వెనక్కు తీసుకునే సందర్భంలో రైతులపై కేసులు ఎత్తివేస్తున్నామంటూ ప్రకటించిన మోదీ, ఏడాది అవుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. రైతులపై మోదీ కక్ష సాధింపుకి దిగుతున్నారంటూ మండిపడుతున్నారు.

First Published:  9 Nov 2022 4:15 AM GMT
Next Story