Telugu Global
National

భారతీయులారా బహుపరాక్.. మరికొన్ని గంటల్లో అచ్చేదిన్

మోదీ 2022 టార్గెట్ గా చెప్పిన హామీలన్నిట్నీ ఒకేచోట చేర్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అచ్చేదిన్ అని భారతీయులంతా సంబరపడుతున్న సమయం రానే వచ్చిందని అంటున్నారు.

భారతీయులారా బహుపరాక్.. మరికొన్ని గంటల్లో అచ్చేదిన్
X

2022 వెళ్లిపోతూ వెళ్లిపోతూ ప్రధాని మోదీపై అద్భుతమైన జోక్ పేల్చింది. 2022 సంవత్సరాన్ని అడ్డు పెట్టుకుని మోదీ చెప్పిన అబద్ధాలన్నీ ఇప్పుడు కళ్లకు కడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. భారతీయులారా మరికొన్ని గంటలు ఓపిక పట్టండి, మీరు కోరుకున్న అచ్చేదిన్ వచ్చేస్తున్నాయంటూ మోదీ 2022 టార్గెట్ గా చెప్పిన హామీలన్నిట్నీ ఒకేచోట చేర్చి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అచ్చేదిన్ అని భారతీయులంతా సంబరపడుతున్న సమయం రానే వచ్చిందని అంటున్నారు.




2019 ఎన్నికల వేళ.. మోదీ కొత్త హామీలతో చెలరేగిపోయారు. భారతీయ ఎకానమీ 2022నాటికి రెట్టింపు అవుతుందని, 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆయన హామీ ఇచ్చేశారు. కానీ ఇప్పుడది రివర్స్ లో పరుగులు పెడుతోంది. మరో పదేళ్లయినా భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే ఆశ లేదు.





2022నాటికి భారతీయులందరికీ ఇళ్లు..

ఈ హామీ 2014నాటిది. తొలిసారి అధికారంలోకి రావాలన్న ఆశతో, ఆతృతతో మోదీ అలవికాని హామీలిచ్చేశారు, ప్రజల్ని బుట్టలోపడేశారు. 2022నాటికి భారతీయులందరి సొంతింటి కల నెరవేరుస్తానన్నారు. కానీ ఆ కల కలగానే మిగిలిపోయింది. 2042 వచ్చినా అది పూర్తికాదని తేలిపోయింది.

24గంటల కరెంటు సౌకర్యం..

ఇది మరో పెద్ద జోక్. 2014లో అధికారంలోకి వచ్చాక ఏడాది తర్వాత ఈ జోక్ పేల్చారు మోదీ. 2022నాటికి భారతీయులందరికీ సొంతింటి కల నెరవేర్చడంతోపాటు 24గంటల కరెంటు సౌకర్యం కల్పిస్తామన్నారు. అసలు ఇల్లే లేకపోతే ఇక ఇంటికి కరెంటు ఎక్కడినుంచి ఇస్తారు. ఈ హామీ కూడా తుస్సుమంది. 2022 కేలండర్ తిరిగిపోతూ మోదీని వెక్కిరిస్తోంది.

రైతుల ఆదాయం రెట్టింపు..

2022నాటికి జరగబోయే మరో అద్భుతం అంటూ ఆనాడు మోదీ ఇచ్చిన హామీ రైతుల ఆదాయం రెట్టింపవడం. ఆదాయం రెట్టింపు కాదు కదా, పెట్టుబడి పెరిగిపోయి, గిట్టుబాటు ధరలు లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పీఎం కిసాన్ అంటూ కంటితుడుపు చర్యలు చేపట్టడం మినహా రైతుల ఆదాయం రెట్టింపయ్యే ఏ నిర్ణయం కూడా మోదీ తీసుకోలేకపోయారు. రైతుల ఆదాయం రెట్టింపవలేదు కానీ, ద్రవ్యోల్బణం పెరిగి ఆహార ఉత్పత్తుల రేట్లు రెట్టింపయ్యాయి. వినియోగదారుల నడ్డి విరిచాయి.

2022నాటికి బుల్లెట్ ట్రైన్స్..

మోదీ కలలుకన్న భారత దేశంలో బుల్లెట్ ట్రైన్స్ అటు ఇటు యమా స్పీడ్ గా వెళ్లిపోతుంటాయి. కానీ వాస్తవంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ఢీ కొడితే, బర్రెలు, ఎద్దులు అంతెత్తున ఎగిరిపడుతుంటాయి. ఒక్కోసారి రైలింజన్లు కూడా సొట్టపోయి కనిపిస్తుంటాయి. ఇక బుల్లెట్టు బండి పట్టాలెక్కితే ఇంకేమైనా ఉందా..?

అంతరిక్షంలోకి వ్యోమగాములు..

2022నాటికి అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపించేస్తామని డబ్బాలు కొట్టుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. ఇస్రో శాస్త్రవేత్తలు ఆశావహ దృక్పథంతో అలాంటి ప్రకటన చేశారంటే దానికో అర్థముంది, ఆ విషయంలో కూడా మోదీ తన చతురత ప్రదర్శించడమే ఇక్కడ విశేషం. వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపడం కాదు కదా, చైనా సైనికుల్ని బోర్డర్ దాటి పంపించే విషయంలోనూ పార్లమెంట్ లో ప్రతిపక్షాల విమర్శలను కాచుకోవాల్సి వస్తోంది మోదీ.

మొత్తానికి 2022 వెళ్తూ వెళ్తూ ప్రధాని మోదీపై గొప్ప సెటైర్లు పేలుస్తోంది. అచ్చేదిన్ కోసం మరికొన్ని గంటలే సమయం ఉందంటూ సోషల్ మీడియా హోరెత్తుతోంది.

First Published:  31 Dec 2022 2:53 PM GMT
Next Story