మోడీ, కేజ్రీవాల్ ఇద్దరు ఒక్కటే.. పేర్లు మాత్రమే వేరు
ఢిల్లీ ఎన్నికల కోసం రెండు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్. ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను విడుదల చేసినరేవంత్ రెడ్డి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించి పోస్టర్లను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఢిల్లీలో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని.. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను తాము నెరవేరుస్తున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణలో మేము ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నాం. రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. విజయవంతంగా ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతున్నది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని అని రేవంత్‌రెడ్డి కోరారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్, మోడీలపై రేవంత్ ఫైర్ అయ్యారు. మోడీ, కేజ్రీవాల్ ఇద్దరు ఒక్కటే.. పేర్లు మాత్రమే వేరని ఎద్దేవా చేశారు. ఇద్దరూ అబద్ధాలు ఆడుతారని విమర్శించారు. మూడుసార్లు సీఎంగా కేజ్రీవాల్, మూడు సార్లు ప్రధానిగా మోడీ ఎన్నికయ్యారు. కానీ ఢిల్లీకి ఏం చేశారు? కాంగ్రెస్ సీఎం షీలా దీక్షిత్ హయాంలోనే మెట్రోరైల్ వచ్చిందని, అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. కానీ ఇప్పుడు ఢిల్లీ కాలుష్యమయంగా మారిందన్నారు. కాలుష్యంతో తెలంగాణ ప్రజలు ఢిల్లీకి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పటికి మూడుసార్లు వాళ్లకు అవకాశం ఇచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ ఢిల్లీ ఓటర్లను కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీలు ఇవే
రూ. 500 లకే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్
300 యూనిట్ల ఉచిత కరెంట్
ఉచిత రేషన్ కిట్లు
యువ ఉడాన్ యోజన: ఏడాదిపాటు నిరుద్యోగ యువతకు ప్రతినెలా రూ. 8,500
ప్యారీ దీదీ యోజన: మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం
జీవన్ రక్ష యోజన: రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా
70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.