మోదీని వెంటాడుతున్న డాక్యుమెంటరీ..
అమెరికాలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు రెండు హక్కుల సంఘాలు నిర్ణయించాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు జూన్ 20న వాషింగ్టన్ లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించబోతున్నట్టు తెలిపాయి.
గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీ ప్రధాని మోదీని అంత తేలిగ్గా వదిలిపెట్టేలా లేదు. భారత్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఆ లింకులేవీ లేకుండా జాగ్రత్తపడినా కొత్తవి పుట్టుకొస్తునే ఉన్నాయి. విదేశాల్లో కూడా ఆ డాక్యుమెంటరీ సంచలనంగా మారింది. మోదీ ఏ దేశ పర్యటనకు వెళ్లినా, ఆయన పర్యటన సమయంలోనే అక్కడి మానవ హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు ఈ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తున్నాయి. భారత్ లో మోదీ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆమధ్య మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే.. అక్కడి పార్లమెంట్ హౌస్ లో బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తాజాగా ఆయన అమెరికా పర్యటనకు వెళ్తుండగా అక్కడ కూడా బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దంపతులు మోదీకి ఆతిథ్యం ఇస్తారు. ప్రధాని పర్యటనపై అమెరికా ఆసక్తిగా ఎదురుచూస్తోందంటూ ఇక్కడి భక్తులు ప్రచారం మొదలు పెట్టారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయని, వ్యాపార-వాణిజ్య కార్యకలాపాల పెరుగుదలకు మోదీ పర్యటన సహకరిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు అక్కడి హక్కుల సంఘాలు సిద్ధమవడం సంచలనంగా మారింది.
అమెరికాలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు రెండు హక్కుల సంఘాలు నిర్ణయించాయి. హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థలు జూన్ 20న వాషింగ్టన్ లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించబోతున్నట్టు తెలిపాయి. మీడియా ప్రతినిధులు, రాజకీయ విశ్లేషకులు ఈ స్క్రీనింగ్ కి హాజరుకావాల్సిందిగా ఆయా హక్కుల సంఘాలు ఆహ్వానించాయి.
మొత్తమ్మీద బీబీసీ డాక్యుమెంటరీ భారత్ లో సంచలనంగా మారడమే కాకుండా.. విదేశాల్లో కూడా మోదీని వెంటాడుతోంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ హక్కుల కార్యకర్తలు ఆ డాక్యుమెంటరీతో రెడీగా ఉంటున్నారు. ఈ వ్యవహారంలో కవర్ చేసుకోలేక మోదీ అవస్థలు పడుతున్నారు.