Telugu Global
National

ఫోన్ చేతిలో ఉంటే చిరాకు.. దంపతుల మధ్య మొబైల్ చిచ్చు

సెల్ ఫోన్లను మితిమీరి వాడటం వల్ల వైవాహిక సంబంధాలు దెబ్బతింటున్నాయని 88శాతం మంది తమ ఆవేదన వెలిబుచ్చారు. ఇలా ఆవేదన చెందేవారు కూడా సెల్ ఫోన్ ని దూరం పెట్టలేకపోతున్నారు.

ఫోన్ చేతిలో ఉంటే చిరాకు.. దంపతుల మధ్య మొబైల్ చిచ్చు
X

భార్యా భర్తలు ఒకే గదిలో ఉన్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు, కానీ ఇద్దరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఎవరి లోకం వారిది, ఎవరి ప్రైవసీ వారిది. పొరపాటున సెల్ ఫోన్ చేతిలో ఉండగా జీవిత భాగస్వామి ప్రేమగా పలకరించినా అవతలి వ్యక్తి తెగ చిరాకుపడిపోతారు. ఏం మాట్లాడారు అనే విషయం పట్టించుకోరు, ఫోన్ చేతిలో ఉండగా ఎందుకు డిస్ట్రబ్ చేశారు అనేదే అక్కడ కాన్సెప్ట్. ఇలా జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. భార్యా భర్తల మధ్య మొబైల్ ఫోన్ పెడుతున్న చిచ్చు చివరకు విడాకుల వరకు దారి తీస్తోంది. భారత్ లో ఈ వ్యవహారంపై ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'స్విచాఫ్‌' పేరుతో ఓ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు బయటపడ్డాయి.

కదిలిస్తే కంపరం..

చేతిలో సెల్ ఫోన్ ఉండగా ఎవరైనా కదిలిస్తే కొందరికి కోపం వస్తుంది. ఆ పలకరించింది తన జీవిత భాగస్వామి అయినా సరే 70శాతం మంది చిరాకు పడుతున్నారని 'స్విచాఫ్‌' సర్వే తేల్చింది. 67 శాతం మంది వినియోగదారులు తమ జీవిత భాగస్వామి పక్కనే ఉన్నా కూడా స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నామని ఒప్పుకొన్నారు. సెల్ ఫోన్లను మితిమీరి వాడటం వల్ల వైవాహిక సంబంధాలు దెబ్బతింటున్నాయని 88శాతం మంది తమ ఆవేదన వెలిబుచ్చారు. విచిత్రం ఏంటంటే.. ఇలా ఆవేదన చెందేవారు కూడా సెల్ ఫోన్ ని దూరం పెట్టలేకపోతున్నారు. భార్యాభర్యలిద్దరూ సెల్ ఫోన్లు విపరీతంగా వాడుతుంటారు, కానీ తప్పు తమది కాదని వారు చెబుతుంటారు.

ఖాళీ సమయంలో కూడా..

అవసరం కోసం ఫోన్లు చేయడం, ఆన్సర్ చేయడం, వాట్సప్ చూడటం.. ఇలాంటి సమయాన్ని పక్కనపెడితే.. ఎంత బిజీ లైఫ్ లో అయినా రోజుకి సగటున గంటన్నర ఖాళీ సమయం ఉంటుంది. ఈ గంటన్నర సమయాన్ని కూడా సెల్ ఫోన్ కే కేటాయిస్తున్నారు దంపతులు. భార్య, భర్త పక్క పక్కనే ఉన్నా కూడా సెల్ ఫోన్ ని మాత్రం పక్కనపెట్టడంలేదు.

సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ సహ భాగస్వామిగా జరిగిన ఈ సర్వేలో.. దంపతుల్లో చాలామమంది ఈ పద్ధతి మారాలని కోరుకుంటున్నారట. జీవిత భాగస్వామితో మరింత అందమైన సమయం గడపాలని ఉందని 84 శాతం మంది కోరుకుంటున్నారు. ఫోన్లకు బానిసలుగా మారినా తమ బంధాలను పునరుద్ధరించుకోవాలనే కోరిక చాలామంది కనబరిచారని ఈ సర్వే తేల్చింది.

First Published:  13 Dec 2022 8:08 AM IST
Next Story