పార్టీ మారేటప్పుడు ఇంత ఓవర్ చేయాలా? 300 కి.మీ.. 400 కార్లతో సైరన్ కొడుతూ వెళ్లిన నేత
పార్టీలో చేరేటప్పుడు తన బలం ఏంటో చూపించడానికి బైజనాథ్ సింగ్ 400 కార్లతో శివపురి నుంచి బోఫాల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.
రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు తమ బలాన్ని ప్రదర్శించాలని చూస్తుంటారు. వాహనాల్లో వేలాది మందిని తరలించి సత్తా చూపే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ కి చెందిన ఒక బీజేపీ నాయకుడు పార్టీ మారేటప్పుడు ఇంతకంటే ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు.
400 కార్ల కాన్వాయ్ తో 300 కిలోమీటర్ల మేర సైరన్ మోగించుకుంటూ వెళ్లి పార్టీ మారాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విమర్శలు వస్తున్నాయి. నువ్వు పార్టీ మారితే రోడ్లపై ఇంత రచ్చ చేయాలా? జనాన్ని ఇంత ఇబ్బంది పెట్టాలా? అని నెటిజన్లు మండిపడుతున్నారు.
బైజనాథ్ సింగ్ అనే ఎమ్మెల్యే 2020లో జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఆ సమయంలోనే మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహన్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.
కాంగ్రెస్ ను చీల్చి బీజేపీలో చేరిన సింధియాకు కేంద్ర మంత్రి పదవి లభించగా, బైజనాథ్ సింగ్ కు పదవులు ఏమి దక్కలేదు. కనీసం వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా టికెట్ వచ్చే అవకాశం కనిపించకపోవడంతో తిరిగి సొంతగూటికి వెళ్లాలని బైజనాథ్ సింగ్ నిర్ణయించుకున్నారు.
పార్టీలో చేరేటప్పుడు తన బలం ఏంటో చూపించడానికి బైజనాథ్ సింగ్ 400 కార్లతో శివపురి నుంచి బోఫాల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అయితే బైజనాథ్ సింగ్ మద్దతుదారులు దారి వెంట మూడు వందల కిలోమీటర్ల పాటు సైరన్ కొట్టుకుంటూ వెళ్లారు. ఈ వ్యవహారాన్ని కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు చూసిన పలువురు బైజనాథ్ సింగ్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దారి వెంట సైరన్లు మోగించుకుంటూ వెళ్తూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటని మండిపడ్డారు.