Telugu Global
National

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. తొలిదశ పోలింగ్ మొదలు

మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు నేడు సింగిల్ ఫేజ్ లో పోలింగ్ ముగుస్తుంది. చత్తీస్ ఘడ్ లోని మొత్తం 90 స్థానాలకు గాను ఈరోజు 20 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. తొలిదశ పోలింగ్ మొదలు
X

ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న పోలింగ్ లో నేడు తొలిదశ మొదలైంది. మిజోరం, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఈ ఉదయం 7 గంటలనుంచి ఓటింగ్ ప్రారంభమైంది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు నేడు సింగిల్ ఫేజ్ లో పోలింగ్ ముగుస్తుంది. మొత్తం 140మంది అభ్యర్థులు మిజోరం ఎన్నికల బరిలో నిలిచారు. అటు చత్తీస్ ఘడ్ కి సంబంధించి ఇది తొలిదశ పోలింగ్ మాత్రమే. చత్తీస్ ఘడ్ లోని మొత్తం 90 స్థానాలకు గాను ఈరోజు 20 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


మిజోరం, ఛత్తీస్‌ ఘఢ్‌, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. అయితే వివిధ దశల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ కి సంబంధించి నవంబర్​ 17న ఒకే దశలో పోలింగ్​ జరగాల్సి ఉంది. రాజస్థాన్ ​లో నవంబర్​ 23న, తెలంగాణలో నవంబర్​ 30న సింగిల్ ఫేజ్ లో పోలింగ్ ముగుస్తుంది. మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి డిసెంబర్ 3న ఫలితాలు విడుదల చేస్తారు.

5 రాష్ట్రాల్లో 1.77లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దాదాపు 16కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు మొదలైన రెండు రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈరోజుతో మిజోరంలో ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి.. అక్కడ స్ట్రాంగ్ రూమ్ లకు సెక్యూరిటీ ఉంచుతారు. బలగాలను మిగతా రాష్ట్రాలకు పంపిస్తారు.

First Published:  7 Nov 2023 8:01 AM IST
Next Story