Telugu Global
National

'నమో' అంటే నమ్మించి మోసం చేయడం.. కేటీఆర్ సెటైర్లు..

హిమాచల్, గుజరాత్ ఎన్నికల ముందు మోదీ రోజ్ గార్ మేళా అంటూ కొత్త డ్రామాకి తెరతీశారని మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ హయాంలో ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.

నమో అంటే నమ్మించి మోసం చేయడం.. కేటీఆర్ సెటైర్లు..
X

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రోజ్‌ గార్ మేళా పచ్చి దగా అని విమర్శించారు. యువతను మరోసారి మోసం చేసేందుకే దీన్ని తీసుకొచ్చారని అన్నారు కేటీఆర్. 'నమో' అంటే నమ్మించి మోసం చేసేవాడని రుజువైందని సెటైర్లు వేశారు కేటీఆర్. ఇది దేశ ప్రజలకు కొత్త కాదని, ప్రతి ఎన్నికల ముందు ఇలాంటి మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయని చెప్పారు. యువతను మోసపుచ్చే ఇలాంటి ప్రచార కార్యక్రమాలను పక్కన పెట్టి.. నిబద్దతతో నిరుద్యోగ సమస్యపైన దృష్టి సారించాలని మోదీకి సూచించారు కేటీఆర్. ఇటీవల రోజ్ గార్ యోజన అంటూ దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు ఉద్యోగ నియామక పత్రాలు అందించడాన్ని మోసకారి ప్రయత్నంగా అభివర్ణించారు కేటీఆర్.

హిమాచల్, గుజరాత్ ఎన్నికల వేళ..

హిమాచల్, గుజరాత్ ఎన్నికల ముందు మోదీ రోజ్ గార్ మేళా అంటూ కొత్త డ్రామాకి తెరతీశారని మండిపడ్డారు కేటీఆర్. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ 2014 ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన మోదీ, ఎనిమిదేళ్లలో 16 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందంటూ నిలదీశారు. తీరా ఇప్పుడు 75 వేల ఉద్యోగాల నియామకాలంటూ ఎవరిని మోసగిస్తారని ప్రశ్నించారు.

శ్వేతపత్రం విడుదలకు డిమాండ్..

బీజేపీ హయాంలో ఇప్పటివరకూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం 2,24,000 ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు సుమారు 16.5 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రైవేట్ రంగంలో కల్పిస్తోందని వివరించారు కేటీఆర్. ఒక్క తెలంగాణలోనే ఇన్ని ఉద్యోగాలు వస్తే, కేంద్ర ప్రభుత్వంగా మీరు దేశవ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించాలని నిలదీశారు. ఏటా 50 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేని కేంద్రం, రోజ్‌ గార్ మేళా పేరుతో కేవలం 75 వేల మందికి నియామక పత్రాల అందచేయడాన్ని దేశ నిరుద్యోగులు గమనిస్తున్నారని, ఇలాంటి మోసకారి తెలివి తేటలు ఎక్కువ రోజులు ఫలితాలు ఇవ్వలేని చెప్పారు. 75 వేల ఉద్యోగాల పేరుతో కేంద్రం చేస్తున్న రోజ్‌ గార్ ప్రచారం, దేశ నిరుద్యోగ యువతను పరిహాసం చేయడమేనన్నారు కేటీఆర్. ఈసారి కూడా ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేస్తే, కేంద్రంపై నిరుద్యోగులు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు.

First Published:  25 Oct 2022 7:19 PM IST
Next Story