Telugu Global
National

మహిళల వివాహ వయస్సు 21కి పెంచండి.. సుప్రీం సమాధానం ఏంటంటే..?

ఈ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. కొన్ని విషయాలను పార్లమెంటు మాత్రమే తేల్చగలదు అని, కోర్టులు చట్టాలు చేయలేవంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

మహిళల వివాహ వయస్సు 21కి పెంచండి.. సుప్రీం సమాధానం ఏంటంటే..?
X

భారత దేశంలో పురుషుల కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు, స్త్రీల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు. ఈ రెండు వేర్వేరుగా ఉండటంలో లాజిక్ ఏంటి..? స్త్రీలు కూడా పురుషులతో సమానంగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి వివాహ వయస్సు వారికి తక్కువగా ఉండటానికి కారణం ఏంటి..? వెంటనే వివాహ వయస్సు పెంచుతూ నిర్ణయం తీసుకోండి, పురుషులతోపాటు స్త్రీలకు కూడా కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు చేయండి అంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యవహారం పార్లమెంట్ పరిధిలోనిది అని తేల్చి చెప్పింది.

ఈ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది కూడా. కొన్ని విషయాలను పార్లమెంటు మాత్రమే తేల్చగలదు అని, కోర్టులు చట్టాలు చేయలేవంటూ సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. స్త్రీ, పురుషుల వివాహ వయసుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. ఈ విషయంలో చట్టం చేయాలంటూ పార్లమెంటుకు కూడా ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది.

స్త్రీల కనీస వివాహ వయస్సుని 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది, అయితే ఇది చట్టం రూపంలో రావాల్సి ఉంది. ఇప్పటికే బాల్య వివాహాల పేరుతో అసోంలో భర్తలను వేధిస్తోంది ప్రభుత్వం, ఇక ఈ చట్టం అమలులోకి వస్తే, బాల్య వివాహాల సంఖ్య మరింత పెరిగే అవకాశముంటుంది. అదే సమయంలో ప్రేమ పేరుతో బాలికలు మోసపోకుండా ఉండేందుకు కూడా అవకాశం లభించినట్టవుతుందనేది కొంతమంది వాదన. చదువుకున్న అమ్మాయిలు 21 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలనే పట్టుదల ఉన్నవారు మరికొన్ని సంవత్సరాలు వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఇక పల్లెటూళ్లలో, కుమార్తెల వివాహాన్ని బరువు, బాధ్యతగా భావిస్తున్న తల్లి దండ్రులు మాత్రమే 18 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెడుతున్నారు. స్త్రీ పురుషులిద్దరికీ కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా ఇందులో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టత ఇవ్వడం మాత్రం విశేషం.

First Published:  20 Feb 2023 7:10 PM IST
Next Story