Telugu Global
National

మమతా ఏంటిది?.. ఆర్ఎస్ఎస్‌కు మద్దతిస్తావా? : ఒవైసీ

బెంగాల్ లోని ముస్లింలంతా చాలా ఏళ్లుగా దీదీకి అండగా నిలబడుతున్నారు. నిజానికి ఆర్ఎస్ఎస్ పై ముస్లింలలో సదభిప్రాయం ఉండదు. ఈ నేపథ్యంలో దీదీ వ్యాఖ్యలు తృణముల్ కు చేటు చేకూరుస్తాయన్న వాదన వినిపిస్తోంది.

మమతా ఏంటిది?.. ఆర్ఎస్ఎస్‌కు మద్దతిస్తావా? : ఒవైసీ
X

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ సీఎం మమతా బెన‌ర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె ఆర్ఎస్ఎస్‌కు మద్దతు తెలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విద్వేషాన్ని కోరుకుంటుంది. హిందూ రాష్ట్రాన్ని కాంక్షిస్తుంది. మతాల మధ్య చిచ్చు పెడుతుంది. అటువంటి సంస్థ గొప్పదని దీదీ మెచ్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది. ఆమెకు అందులో ఏం నచ్చిందో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా దీదీ స్థిరత్వాన్ని మెచ్చుకోవచ్చు' అంటూ అసదుద్దీన్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే ఇటీవల మమతా బెనర్జీ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ పై కాస్త సానుకూలంగా మాట్లాడారు. 'ఆర్ఎస్ఎస్ లో అందరూ చెడ్డవాళ్లని నేను అనుకోవడం లేదు. అందులోనూ గొప్ప వ్యక్తులు ఉన్నారు. బీజేపీని వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. వాళ్లూ ఏదో ఒకరోజు బయటకు వచ్చి బీజేపీని వ్యతిరేకిస్తారని నేను భావిస్తున్నాను' అంటూ ఆమె వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీదీ ఏ ఉద్దేశ్యంతో ఈ మాటలు అన్నా ఆమెకు మాత్రం నష్టం చేకూర్చాయన్న వాదన వినిపిస్తోంది. బెంగాల్ లోని ముస్లింలంతా చాలా ఏళ్లుగా దీదీకి అండగా నిలబడుతున్నారు. నిజానికి ఆర్ఎస్ఎస్ పై ముస్లింలలో సదభిప్రాయం ఉండదు. ఈ నేపథ్యంలో దీదీ వ్యాఖ్యలు తృణముల్ కు చేటు చేకూరుస్తాయన్న వాదన వినిపిస్తోంది.

First Published:  1 Sept 2022 8:14 PM IST
Next Story