బీహార్ లో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తి చేసిన మేఘా
సీఎం నితీష్ కుమార్, జలవనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా ప్రత్యేక పర్యవేక్షణలో మూడేళ్ల కాలంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. కరోనా సమయంలో కూడా ఎక్కడా ఆటంకం కలగకుండా సమర్థంగా పనుల్ని పూర్తి చేసింది మేఘా సంస్థ.
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(MEIL) సంస్థ బీహార్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు భారీ తాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేసింది. ఇప్పటి వరకూ గంగా నది వరదలతో హడలిపోయిన బీహార్ వాసులకు, వరదనీటిని తాగునీటిగా మార్చి అందివ్వబోతోంది మేఘా సంస్థ. నవంబర్ 27న రాజ్ గిరిలో, నవంబర్ 28న బోధ్ గయలో ఈ ప్రాజెక్ట్ లను బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రారంభిస్తారు.
హర్ ఘర్ గంగాజల్..
బీహార్ నుంచి గంగానది ప్రవహిస్తున్నా, దక్షిణ బీహార్ లోని చాలా ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉంది. నీటి ఎద్దడితోపాటు, వరదల సమయంలో గంగమ్మ ఉగ్రరూపాన్ని కూడా వారు చవిచూడాల్సి వస్తోంది. దక్షిణ బీహార్ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు హర్ ఘర్ గంగాజల్ పథకాన్ని ప్రకటించారు సీఎం నితీష్ కుమార్. జల్ జీవన్ హరియాలీ మిషన్ కింద తాగునీటి ప్రాజెక్ట్ లను మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మేఘా సంస్థ ''గంగాజల్ ఆపూర్తి యోజన'' మొదలు పెట్టింది.
పనులెలా జరిగాయంటే..?
మొదటి దశలో పాట్నాలోని మొకామా ప్రాంతం హతిదాలో మొదటి ఇన్ టేక్ వెల్, పంప్ హౌస్ నిర్మించారు. హతిదా నుంచి రాజ్ గిర్ వద్ద నిర్మించిన డిటెన్షన్ ట్యాంక్ కు పైప్ లైన్ నెట్ వర్క్ ద్వారా నీరు పంపిస్తారు. దీని కోసం హతిదా, రాజ్ గిర్, తేటర్, గయలో మొత్తం నాలుగు పంప్ హౌస్ లు, మూడు భారీ రిజర్వాయర్ లు నిర్మించారు. ఈ రిజర్వాయర్ల లోకి వరద నీటిని నింపి, అక్కడి నుండి రాజ్ గిర్, మన్పూర్, గయ వద్ద ఏర్పాటు చేసిన మూడు నీటి శుద్ధి కర్మాగారాలకు నీటిని పంపిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా రెండు విద్యుత్ సబ్ స్టేషన్లు, 151 కిలోమీటర్ల పొడవు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. నాలుగు వంతెనలతోపాటు రైల్వే ఓవర్ బ్రిడ్జిని కూడా మొదటి దశ పనుల్లో భాగంగా నిర్మించారు. మేఘా సంస్థకు ఈ అన్నిరంగాల్లో అనుభవం ఉండటంతో.. అనుకున్న సమయానికే సబ్ స్టేషన్ల నిర్మాణం, పైప్ లైన్ నిర్మాణం, వంతెనలు, ఓవర్ బ్రిడ్జ్ లు, పంప్ హౌస్ లు, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయింది.
ప్రతి ఏడాది 7.5 లక్షల మంది ప్రజలు, యాత్రికులు, పర్యాటకులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం కలుగుతుంది. స్థానికులకు 365 రోజులపాటు మంచినీరు అందుబాటులో ఉంటుంది. సీఎం నితీష్ కుమార్, జలవనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా ప్రత్యేక పర్యవేక్షణలో మూడేళ్ల కాలంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తయింది. కరోనా సమయంలో కూడా ఎక్కడా ఆటంకం కలగకుండా సమర్థంగా పనుల్ని పూర్తి చేసింది మేఘా సంస్థ.