గుజరాత్ సిఎం అభ్యర్ధిగా మేథా పాట్కర్ పేరు..ఆప్ లో రేగుతున్న చిచ్చు
ఆమ్ ఆద్మీ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మేథా పాట్కర్ ను ప్రకటించబోతుందనే వార్త గుజరాత్ లోని ఆప్ లో వ్యతిరేకతకు కారణమవుతోంది. గుజరాత్ లోని చాలా మంది ఆప్ నేతలు ఆమెను వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
త్వరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేథా పాట్కర్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఆమె 2014 సార్వత్రిక ఎన్నికల ముందు ఆప్ లో చేరారు. 2015 లో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు సిఎం రేసులో ఆమె పేరు వినబడడంపై ఆప్ ఎటువంటి ప్రకటన చేయలేదు, ఖండించనూలేదు. దీంతో గుజరాత్ ఆప్ నేతలు ఉలికిపాటుకు గురయ్యారు. ఇప్పటికే 19 మంది అభ్యర్ధుల పేర్లను అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రకటించారు. మేథా పేరు బయటికి రావడంతో వీరిలో 13 మంది వ్యతిరేకిస్తున్నారు. ఆమె పేరును అభ్యర్ధిగా ప్రకటిస్తే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవాళ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్ధులతో సమావేశమై వారిని శాంతపరిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే బిజెపి ని గద్దె దించాలని ఆప్ గట్టిగా కృషి చేస్తోంది. ఈ తరుణంలో అనూహ్యంగా మేథా పేరు గత వారం బయటికి రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పటివరకు ఆప్ గుజరాత్ చీఫ్ ఇసుదన్ గాధ్వి ఫేవరెట్ అభ్యర్థిగా భావించారు. అయితే మేధా పాట్కర్‌ను అభినందిస్తున్న వీడియోను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ రీ ట్వీట్ చేయడంతో గుజరాత్ ఆప్ లో రచ్చ మొదలైంది.
మేధా పాట్కర్ పై నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆమెపై ఈ ఏడాది జూలైలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనికి ముందు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఈ ఏడాది ఏప్రిల్ 5 న "నర్మదా బచావో ఆందోళన్" సమయంలో అనుమానాస్పద మనీ లాండరింగ్ ఆరోపణలపై మేధా పాట్కర్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. ఈడితో పాటు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం, ఆదాయపు పన్ను శాఖ కూడా పాట్కర్ లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించాయి. ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎక్సైజ్ విధానం కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గుజరాత్ ఆప్ నేతలంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.