కమిషనర్ కుక్క మిస్సింగ్.. 500 ఇళ్లను జల్లెడ పట్టిన పోలీసులు
సీసీ టీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. రోడ్లపై కనిపించిన వారినంతా ఈ కుక్క మిస్ అయ్యింది.. మీకు ఏమైనా కనిపించిందా..? అని అడుగుతూ పోలీసులు పట్టణమంతా గాలించారు.
సామాన్యులు న్యాయం కోసం రోజులు, ఏళ్ల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటారు. పోలీసులు వారి పని చేసి పెట్టడం అటుంచి స్టేషన్‌కు వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తిస్తుంటారు. అయితే తమ పైఅధికారులో, ప్రజాప్రతినిధులకో సమస్య ఎదురైతే మాత్రం క్షణాల్లో పరిష్కరిస్తుంటారు. వారికోసం అన్ని పనులు పక్కన పెట్టి చక్కబెడుతుంటారు.
యూపీలో ఇప్పుడు అదే జరిగింది. పోలీస్ కమిషనర్ కుక్క కనిపించకుండా పోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి 36 గంటల్లో 500 ఇళ్లను జల్లెడపట్టారు. ఈ విషయం గురించి బయటకు తెలియడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిత్యం ఎన్నో నేరాలు జరుగుతుంటే శాంతి భద్రతలను పక్కనపెట్టి కుక్క కోసం అన్ని గంటలు శ్రమించి గాలింపులు చేపట్టాలా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
మీరట్ పోలీస్ కమిషనర్‌గా సెల్వ కుమారి పనిచేస్తున్నారు. ఆమె పెంపుడు కుక్క ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. ఆ కుక్క సైబీరియన్ హస్కీ జాతికి చెందినది. దాని పేరు ఎకో. కమిషనర్ కుక్క మిస్ అయినట్లు తెలుసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయారు. కుక్క ఫొటోలు చేతిలో పట్టుకొని 36 గంటలపాటు 500 ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.
సీసీ టీవీ ఫుటేజీని కూడా పరిశీలించారు. రోడ్లపై కనిపించిన వారినంతా ఈ కుక్క మిస్ అయ్యింది.. మీకు ఏమైనా కనిపించిందా..? అని అడుగుతూ పోలీసులు పట్టణమంతా గాలించారు. జంతువుల సంరక్షణ అధికారి హర్పాల్ సింగ్ కూడా కమిషనర్ ఇంటి వద్దకు వచ్చి కనిపించకుండా పోయిన కుక్క ఫొటోలు తీసుకొని పోలీసులకు సహాయంగా గాలింపు చేపట్టారు.
కమిషనర్ కుక్క మిస్ అయినట్లు పోలీసులు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు. చివరికి సోషల్ మీడియాలో ఈ కుక్క ఫొటోలు చూసిన ఓ వ్యక్తి తనకు కనిపించిన కుక్క.. ఇది ఒకటేనని గుర్తించి.. దానిని తీసుకెళ్లి కమిషనర్ కు అప్పగించాడు. అయితే ఈ కుక్క మిస్సింగ్ వ్యవహారం సోషల్ మీడియా వరకు చేరడంతో నెటిజన్లు పోలీసుల తీరుపై విమర్శలు చేశారు.
శాంతి భద్రతలు గాలికి వదిలేసి కుక్క కోసం అంతమంది రోడ్లు పట్టుకుని తిరగాలా..? అని మండిపడ్డారు. ఈ విషయం వివాదంగా మారడంతో కమిషనర్ స్పందించారు. తమ పెంపుడు కుక్క కోసం పోలీసులు గాలించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు.