Telugu Global
National

119 మెడికోలు ఆత్మహత్య.. 1166మంది విద్యకు దూరం

వేధింపులు, ఒత్తిడి వల్ల వైద్య విద్య మధ్యలో వదిలేసి వెళ్తున్నవారు కూడా చాలామందే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్‌ కు గుడ్‌ బై చెప్పారని జాతీయ వైద్య మండలి రిపోర్టు వివరించింది.

119 మెడికోలు ఆత్మహత్య.. 1166మంది విద్యకు దూరం
X

కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యతో ఒక్కసారిగా మెడికల్ విద్యార్థుల్లో కలకలం రేగింది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, మంచి ర్యాంక్ తెచ్చుకుని మెడికల్ సీటు సాధించి చదువుకుంటున్నవారు ఇలా అర్థాంతరంగా ఎందుకు తనువు చాలిస్తున్నారనే చర్చ మొదలైంది. ప్రీతి ఒక్కరే కాదు, గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 119మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ వైద్యమండలి ప్రకటించింది. అంటే మెడికల్ స్టూడెంట్స్ ఏ స్థాయిలో ఒత్తిడి అనుభవిస్తున్నారో అర్థమవుతోంది.

వేధింపులు.. ఒత్తిడి..

గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఆత్మహత్యకు పాల్పడిన 119మంది మెడికోల్లో ఎంబీబీఎస్‌ సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా, 55 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థులు కావడం మరింత ఆందోళనకర అంశం. వైద్యవృత్తిలో అడుగు పెట్టేందుకు అదనపు అర్హత కోసం పీజీ చేస్తున్నవారు కూడా ఇలా అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. వేధింపులతోపాటు తీవ్ర మానసిక ఒత్తిడిలో వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.

1166మంది విద్యకు దూరం..

వేధింపులు, ఒత్తిడి వల్ల వైద్య విద్య మధ్యలో వదిలేసి వెళ్తున్నవారు కూడా చాలామందే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్‌ కు గుడ్‌ బై చెప్పారని జాతీయ వైద్య మండలి రిపోర్టు వివరించింది. ఎంబీబీఎస్ యూజీలో 160 మంది, పీజీ జనరల్‌ సర్జరీలో 114 మంది, ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్ - 50 , గైనకాలజీ - 103, ఎంఎస్‌ ఈఎన్‌టీ - 100, ఎండీ జనరల్‌ మెడిసిన్‌ - 56, ఎండీ పిడియాట్రిక్స్ - 54, మిగతా వారు ఇతర బ్రాంచ్ ల వారు అని ఆ రిపోర్ట్ లో ఉంది.

ఒత్తిడి అధికం..

వైద్య విద్యలో ఒత్తిడి అధికం. ఎంట్రన్స్ లో సీటు సంపాదించడంతో పాటు, ఆ తర్వాత పరీక్ష పాసయ్యే వరకు వారు ఓ తపస్సు చేసినట్టే లెక్క. కానీ ఒత్తిడిని తట్టుకుని బయటపడేవారు మాత్రమే వృత్తితోపాటు జీవితంలోనూ రాణిస్తున్నారు. ఒత్తిడిని జయించలేనివారు జీవితంలోనూ పరాజితులుగా మిగులుతున్నారు. మెడిసిన్ చేసే విద్యార్థుల ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడి సంబంధించినవేనని భారత వైద్య మండలి వివరించింది.

First Published:  27 Feb 2023 8:15 AM GMT
Next Story