Telugu Global
National

రేపటి బీఆర్ఎస్ సభ కోసం ముస్తాబైన కందార్-లోహా.. మహారాష్ట్రలో భారీ ప్రచారం

కాందార్-లోహా బహిరంగ సభ ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

రేపటి బీఆర్ఎస్ సభ కోసం  ముస్తాబైన కందార్-లోహా.. మహారాష్ట్రలో భారీ ప్రచారం
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను మహారాష్ట్రలో మరింతగా విస్తరించేందుకు ఈ నెల 26న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించనున్నారు. నాందేడ్‌ జిల్లా కాందార్-లోహా ప్రాంతంలో నిర్వహించనున్న ఈ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే సభ నిర్వహించనున్న బైల్ బజార్‌లోని 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా రహదారుల వెంట గులాబీ తోరణాలు, భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. కాందార్-లోహ ప్రాంతమంతా గులాబిమయంగా మారిపోయింది. గతంలో కాంగ్రెస్, బీజేపీ, శివసేన వంటి పార్టీలు మాత్రమే బహిరంగ సభలు నిర్వహించాయి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అంతకు మించిన ఏర్పాట్లు చేస్తుండటంతో స్థానికులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు.

కాందార్-లోహా బహిరంగ సభ ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే షకీల్, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు మాణిక్ రావు కదమ్, కాందార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న, కన్నాడ్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ తదితరులు కూడా పనుల్లో నిమగ్నమయ్యారు. బీఆర్ఎస్ సభ కోసం ర్భణి, లాతూర్, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఊరూరా ప్రచారం చేస్తున్నారు. కందార్, లోహా, కన్నాడ్, డెగ్లూర్, పూర్ణా, గంగాఖేడ్, ముద్ఖేడ్, పత్రి, పాలా, చందోలి, చౌక్, మన్వర్, అహ్మదాపూర్, ధర్మాబాద్, బిలోలి ప్రాంతాల్లో ప్రచార రధాల్లో తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను వివరిస్తున్నారు. దీంతో పాటు స్థానికులతో ముచ్చటించి.. బీఆర్ఎస్ సభకు భారీగా తరలి రావాలని కోరుతున్నారు.

కాగా.. బీఆర్ఎస్ సభ ఏర్పాట్లలో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. అక్కడ లభిస్తున్న ఆదరణకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వస్తున్నారని స్థానికులు తెలుసుకొని.. సభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని అన్నారు. కందార్, లోహా పట్టణవాసులతో పాటు ఇతర ప్రాంత ప్రజలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని అభివృద్ధిని తమ వద్ద జరుగుతున్న అభివృద్ధితో పోల్చి చూసుకుంటున్నారని ఆయన చెప్పారు. బీఆర్ఎస్‌కు మరాఠా ప్రజల నుంచి తప్పకుండా మంచి స్పందన లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


First Published:  25 March 2023 9:45 AM IST
Next Story