Telugu Global
National

మళ్లీ తెరపైకి మాస్క్ నిబంధన..

పంజాబ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, మాస్క్ నిబంధన తప్పనిసరి చేసింది ఆప్ ప్రభుత్వం. అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులిచ్చింది.

మళ్లీ తెరపైకి మాస్క్ నిబంధన..
X


భారత్‌లో కరోనా కేసులు మరీ ఆందోళన కలిగించేలా లేవు, అలాగని లైట్ తీసుకునేంత తక్కువ కూడా కాదు. నిర్లక్ష్యం వహిస్తే ఏ క్షణంలో అయినా ముప్పు పొంచి ఉందనే భయాన్ని కలిగిస్తూనే ఉన్నాయి రోజువారీ కేసులు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల వేళ.. సామూహిక ప్రదర్శనలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలతో కరోనా భయం పొంచి ఉంది. దీంతో ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మాస్క్ నిబంధన తప్పనిసరి చేశాయి.

బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ లిస్ట్ లోకి పంజాబ్ కూడా చేరింది. పంజాబ్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ, మాస్క్ నిబంధన తప్పనిసరి చేసింది ఆప్ ప్రభుత్వం. అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో మాస్క్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులిచ్చింది. ఇండోర్, అవుట్‌డోర్ సమావేశాలయినా, మాల్స్, బహిరంగ ప్రదేశాలయినా మాస్క్ లేకుండా ఎవరూ కనిపించకూడదని ఆదేశాలిచ్చింది. మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..

దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు అమలవుతూనే ఉన్నాయి. కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ కూడా వేగవంతంగా జరుగుతోంది. కంపెనీతో పనిలేకుండా తొలి రెండు డోసులతో సంబంధం లేకుండా బూస్టర్ డోస్ కి మరో కంపెనీకి కూడా కేంద్రం అనుమతిచ్చింది. దీంతో వ్యాక్సినేషన్ కూడా స్పీడందుకుంది. కంటైన్మెంట్ జోన్లు అనే హడావిడి లేదు కానీ, అనుమానితులు ఉంటే వెంటనే పరీక్షలు చేయడం, కొవిడ్ నిర్థారణ అయితే హోమ్ ఐసోలేషన్ కి రిఫర్ చేయడం నిత్యకృత్యంగా మారింది. ఇక కేసుల విషయానికొస్తే.. భారత్ లో రోజువారీ కేసుల సంఖ్య 15వేలకు తగ్గనంటోంది. అదే సమయంలో కొవిడ్ నుంచి ప్రతిరోజూ కోలుకుంటున్నవారి సంఖ్య 20వేల వరకు చేరడంతో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. డైలీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 4.36 గా ఉంది. అయితే కొవిడ్ కారణంగా ప్రతి రోజూ మరణిస్తున్నవారి సంఖ్య 50 నుంచి 60 మధ్యలో ఉండటం మాత్రం ఆందోళన కలిగించే అంశం.

First Published:  14 Aug 2022 8:16 AM IST
Next Story