జ్యోతిబసు రికార్డును అధిగమించిన నవీన్ పట్నాయక్
తండ్రి బిజూ పట్నాయక్ 1997లో కన్నుమూయడం ఆయనను ఒక్కసారిగా రాజకీయాల్లో తీసుకొచ్చింది. ఉప ఎన్నికతో మొదలైన ప్రస్థానం మూడేళ్లలో సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.
దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన వ్యక్తిగా జ్యోతిబసు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన 23 సంవత్సరాల 139 రోజులు పనిచేశారు. ఇప్పుడు ఆ రికార్డును ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెరిపేయనున్నారు. శనివారంతో జ్యోతిబసుతో సమానంగా నిలిచిన ఆదివారంతో జ్యోతిబసు రికార్డును అధిగమించారు. తద్వారా దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న రెండో సీఎంగా నవీన్ నిలవనున్నారు. మొదటి స్థానం సిక్కిం ముఖ్యమంత్రిగా సేవలందించిన పవన్ కుమార్ చామ్లింగ్ (24 సంవత్సరాల 166 రోజులు) పేరిట ఉంది. నవీన్ పదవీకాలం వచ్చే ఏడాది మే వరకు ఉంది. 2024 ఎన్నికల్లోనూ గెలుపొంది ముఖ్యమంత్రిగా మరోసారి కొనసాగితే చామ్లింగ్ రికార్డును కూడా ఆయన అధిగమిస్తారు.
50 ఏళ్లు దాటేవరకు ఆయన పేరే ప్రజలకు సరిగా తెలీదు..
నవీన్ పట్నాయక్‌కు యాభై ఏళ్లు దాటే వరకు ఒడిశా ప్రజలకు ఆ పేరు పెద్దగా తెలియదు. ఆయనకూ అక్కడి పరిస్థితులపై పెద్దగా అవగాహన లేదు. ఒడియా భాష ఆయనకు రాదు. పుట్టింది కటక్‌లో అయినా స్కూల్ చదువంతా ఢిల్లీలోను, డెహ్రాడూన్‌లోను జరిగింది. దేశ విదేశాల్లోని ఉన్నత రాజకీయ, సంపన్న కుటుంబాల పిల్లలతో స్నేహం ఉండేది. తండ్రి బిజూ పట్నాయక్ 1997లో కన్నుమూయడం ఆయనను ఒక్కసారిగా రాజకీయాల్లో తీసుకొచ్చింది. ఉప ఎన్నికతో మొదలైన ప్రస్థానం మూడేళ్లలో సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది.
ఎంపీగా రెండుసార్లు.. ఎమ్మెల్యేగా ఐదుసార్లు..
ఎంపీగా ఉన్న బిజూ పట్నాయక్ మరణంతో ఖాళీ అయిన ఆస్కా లోక్‌సభ స్థానం నుంచి నవీన్ పట్నాయక్‌ను జనతాదళ్ పార్టీ ఉప ఎన్నికల బరిలో దింపింది. ఎంపీగా గెలుపొందిన ఆయనకు కొద్దిరోజుల్లోనే జనతాదళ్ అగ్ర నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. దాంతో తన తండ్రి పేరిట బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 1998, 1999 లోక్‌సభ, 2000 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని ఘన విజయాలు సాధించారు. వాజ్‌పేయి మంత్రివర్గంలో ఉక్కు శాఖ మంత్రిగా పని చేశారు. నవీన్ పట్నాయక్ తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా 2000 మార్చి 5న బాధ్యతలు స్వీకరించారు. వరుసగా ఐదు సార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
బీజేపీతో మైత్రికి గండి పడినా..
2008లో కొంధమాల్ మత ఘర్షణల నేపథ్యంలో బీజేపీతో మైత్రికి గండి పడింది. అయినా 2009లో ఎన్సీపీ, వామపక్ష పార్టీలను కలుపుకొని శాసనసభ ఎన్నికల బరిలో దిగి నవీన్ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే తన పార్టీని విజయపథంలో నడిపి వరుసగా ముఖ్యమంత్రి అయ్యారు.
నమ్మినవారే.. ముంచబోతే..
బిజూ పట్నాయక్‌కు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన ప్యారీ మోహన్ పాత్రో మాజీ ఐఏఎస్ అధికారి. నవీన్ కు రాజకీయ సలహాదారుగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత రాజ్యసభ సభ్యునిగానూ ఎన్నికై పార్టీలో పట్టు సాధించారు. 2012లో నవీన్ పట్నాయక్ లండన్‌లో ఉన్న సమయంలో ముగ్గురు మంత్రులు, 34 మంది ఎమ్మెల్యేలతో పాత్రో సమావేశమయ్యారు. తనను పదవి నుంచి దింపేందుకు కుట్ర జరుగుతోందని తెలియడంతో నవీన్ హుటాహుటిన లండన్ నుంచి తిరిగివచ్చి పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకున్నారు. వెంటనే పాత్రోను, అత్యంత సన్నిహితంగా ఉన్నా.. తనకు వెన్నుపోటు పొడవబోయిన మంత్రులను ఆయన ఎలాంటి సంకోచం లేకుండా పక్కన పెట్టేశారు. దాంతోనే పాత్రో రాజకీయ జీవితం ముగిసిపోయింది.
నేటికీ పేద రాష్ట్రంగానే ఒడిశా..
టిక్కెట్ల పంపకం, మంత్రుల నియామకం అంతా నవీన్ కనుసన్నుల్లోనే జరగాల్సిందే. పార్టీలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి సన్నిహితులకు సైతం తెలియదు. ప్రజలకు, పార్టీ నాయకులకు ఏం తెలియాలో, ఎంతవరకు తెలియాలో అంత వరకే తెలియనివ్వడంలో నవీన్ దిట్ట. ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఒడిశా మాత్రం నేటికీ పేద రాష్ట్రంగానే మిగిలింది.