Telugu Global
National

రాహుల్ యాత్రలో పాల్గొన వద్దని నాకు చాలా మంది చెప్పారు -కమల్ హాసన్

“నన్ను ఇక్కడకు రావద్దని చాలా మంది చెప్పారు. ఎందుకు వెళ్తున్నావు అని చాలా మంది నన్ను అడిగారు. నా పొల్టికల్ కెరియర్ దెబ్బ తింటుందన్నారు. నేను ఒక భారతీయుడిగా ఇక్కడకి వచ్చాను. మా నాన్న కాంగ్రెస్‌ వాది. నేను వివిధ సిద్ధాంతాలను కలిగి ఉన్నాను, నా స్వంత రాజకీయ పార్టీని ప్రారంభించాను కానీ దేశం విషయానికి వస్తే, అన్ని పార్టీలు కలిసి ఉండాలి. ఇది దేశానికి, నాకు అత్యంత అవసరమైన సమయం. అందుకే నేను ఇక్కడికి వచ్చాను.” అని కమల్ హాసన్ అన్నారు.

రాహుల్ యాత్రలో పాల్గొన వద్దని నాకు చాలా మంది చెప్పారు -కమల్ హాసన్
X

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శనివారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న‌ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ, "నన్ను ఇక్కడకు రావద్దని చాలా మంది చెప్పారు. ఎందుకు వెళ్తున్నావు అని చాలా మంది నన్ను అడిగారు. నా పొల్టికల్ కెరియర్ దెబ్బ తింటుందన్నారు. నేను ఒక భారతీయుడిగా ఇక్కడకి వచ్చాను. మా నాన్న కాంగ్రెస్‌ వాది. నేను వివిధ సిద్ధాంతాలను కలిగి ఉన్నాను, నా స్వంత రాజకీయ పార్టీని ప్రారంభించాను కానీ దేశం విషయానికి వస్తే, అన్ని పార్టీలు కలిసి ఉండాలి. ఇది దేశానికి, నాకు అత్యంత అవసరమైన సమయం. అందుకే నేను ఇక్కడికి వచ్చాను." అన్నారు.

అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తనకు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా కాకుండా తోటి పౌరుడిగా భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ లేఖ రాశారని కమల్ హాసన్ చెప్పారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేరాలని కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం, తమిళనాడులో అధికార డీఎంకే నేతృత్వంలోని కూటమిలో మార్పులు జరగవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో కొత్త మిత్రపక్షం ఏర్పడవచ్చని అంటున్నారు.

2018 ప్రారంభంలో ప్రారంభించినప్పటి నుండి, కమల్ హాసన్ పార్టీ, మక్కల్ నీది మైయం (MNM), ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తున్నది. డిఎంకె సహా ఏఐఏడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ తదితర అన్ని పార్టీలకు దూరంగా ఉంది. కానీ కమల్ హాసన్ ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్ వైపు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ మొదటి నుండీ బీజేపీ మత రాజకీయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా, మనవరాళ్లు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మార్చ్‌లో రాహుల్ గాంధీతో కలిసి శనివారం భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

ఢిల్లీలోని ఆశ్రమ్ చౌక్ వద్ద ఉదయం విరామం కోసం యాత్ర నిలిచిపోయే వరకు సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. గాంధీ కుటుంబం మొత్తం కలిసి భారత్ జోడో యాత్రలో నడవడం ఇదే తొలిసారి.

First Published:  24 Dec 2022 2:16 PM GMT
Next Story