Telugu Global
National

మను బాకర్ క్రేజ్‌ మామూలుగా లేదుగా.. ఏకంగా 40 సంస్థల నుంచి ఆఫర్స్‌!

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ చరిత్ర సృష్టించింది మను బాకర్. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్ ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సరబ్‌ జోత్‌తో కలిసి మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మను బాకర్ క్రేజ్‌ మామూలుగా లేదుగా.. ఏకంగా 40 సంస్థల నుంచి ఆఫర్స్‌!
X

పారిస్‌ ఒలింపింక్స్‌లో రెండు మెడల్స్‌తో సత్తా చాటిన షూటర్‌ మనుబాకర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పలు సంస్థల నుంచి ఆమెకు భారీగా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. గత రెండు, మూడు రోజుల్లోనే 40కిపైగా సంస్థలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని మను బాకర్‌కు సంబంధించిన ఏజెన్సీని సంప్రదించినట్లు తెలుస్తోంది. మను బాకర్‌ ఒలింపిక్స్‌లో కొనసాగుతుండగానే కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఆమె ఎండార్స్‌మెంట్లను మేనేజ్‌ చేసే సంస్థ నిర్వాహకులు స్పష్టం చేశారు.

పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ.20-25 లక్షలు వసూలు చేసింది మనుబాకర్‌. కానీ ప్రస్తుతం బ్రాండ్ వాల్యూ ఏకంగా 6 నుంచి 7 రెట్లు పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ. కోటి 50 లక్షల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. సంస్థలు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మను బాకర్‌ లాంగ్‌ టర్మ్‌ ఎండార్స్‌మెంట్‌ వైపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని షార్ట్ టర్మ్‌ ఎండార్స్‌మెంట్లు సైతం క్యూలో ఉన్నట్లు ఆమె ఏజెన్సీ స్పష్టం చేసింది. ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటింగ్‌లో మెడల్స్ సాధించినప్పటికీ మను బాకర్‌కు అంతగా క్రేజ్ రాలేదని, ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించేసరికి మనుబాకర్ చాలా స్పెషల్‌గా నిలిచిందంటున్నారు ఏజెన్సీ నిర్వహకులు.


పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ చరిత్ర సృష్టించింది మను బాకర్. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్ ఎయిర్‌ పిస్టల్ విభాగంలో సరబ్‌ జోత్‌తో కలిసి మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన ఏకైక అథ్లెట్‌గా రికార్డులకెక్కింది.

మనుబాకర్‌ హర్యానాలో జజ్ఝర్‌లో 2002లో జన్మించింది. యూనివర్సల్ సెకండరీ పబ్లిక్ స్కూల్‌ నుంచి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన మనుబాకర్.. ప్రస్తుతం పంజాబ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ చేస్తోంది. మనుబాకర్ ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక మెడల్స్ సాధించింది. 14వ ఏట నుంచి షూటింగ్ ప్రాక్టీస్ చేసిన మను బాకర్‌.. అనతి కాలంలోనే షూటింగ్‌పై ప్రేమను పెంచుకుంది. 2020 టొక్యో ఒలింపిక్స్‌లో దురదృష్టవశాత్తు మెడల్‌ సాధించలేకపోయిన మను.. ఈసారి చరిత్ర సృష్టించింది.

First Published:  2 Aug 2024 11:20 AM GMT
Next Story