త్రిష, చిరంజీవి, ఖుష్బులపై కేసు పెట్టేందుకు మన్సూర్ రెడీ.. – మళ్లీ మొదలైన రచ్చ
ముగిసిపోయిందనుకున్న గొడవ మళ్లీ కొత్త రూపంలో తెరపైకి వస్తోంది. మన్సూర్ అలీఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో త్రిషకు ఖుష్బు, చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.
సినీ నటి త్రిష గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు మన్సూర్ అలీఖాన్ ఆ తర్వాత.. ఆమెకు క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ‘నా తోటి నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి’ అని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటి త్రిష తన సోషల్ మీడియా పేజీలో ‘తప్పు చేయడం మానవుడి సహజం, క్షమించడం అనేది దైవం చూసుకుంటుంది’ అని పోస్ట్ చేశారు. దీంతో కొద్ది రోజులుగా కొనసాగిన వివాదానికి తెరపడిందని అందరూ భావించారు.
అయితే.. నటుడు మన్సూర్ అలీఖాన్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఈసారి తిరుగుబాటు బావుటా ఎగరేశారు. త్రిష, చిరంజీవి, ఖుష్బులపై పరువునష్టం, పరిహారం, క్రిమినల్, సివిల్ దావా, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం, ఇతరులను రెచ్చగొట్టడం వంటి అన్ని కేటగిరీల కింద కేసు నమోదు చేయబోతున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. తన లాయర్ గురు ధనంజయన్ ద్వారా రేపు కోర్టులో పిటీషన్ వేయబోతున్నట్టు తెలిపారు. వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని ఆయన పేర్కొన్నారు.
నవంబర్ 11న విలేకరుల సమావేశంలో తాను మాట్లాడిన ’నిజమైన వీడియో’ని వారికి పంపించానని మన్సూర్ తెలిపారు. సరిగ్గా వారం తర్వాత నవంబర్ 19న జరిగిన ఈ వీడియోనే తన ప్రసంగానికి ముందు, తర్వాత కొందరు ఎడిట్ చేసి త్రిషను అసభ్యకరంగా మాట్లాడినట్టు చిత్రీకరించారన్నారు. ఈ కేసులో తాను నిజమైన వీడియోను పంపానని, మరికొన్ని ఆధారాలతో రేపు కేసు నమోదు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. దీంతో ముగిసిపోయిందనుకున్న గొడవ మళ్లీ కొత్త రూపంలో తెరపైకి వస్తోంది. మన్సూర్ అలీఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో త్రిషకు ఖుష్బు, చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిషతో పాటు ఖుష్బు, చిరంజీవిలపై మన్సూర్ ఈ కేసు నమోదు చేస్తున్నారు.