అది మన్ కీ బాత్.. ఇది దేశ్ కీ బాత్..
ఢిల్లీలో విద్యార్థులతో కలసి రోడ్డు పక్కనే కూర్చుని మాట్లాడుతున్నారు. రాహుల్ తో మాట్లాడేందుకు యువతీ యువకులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.
మన్ కీ బాత్ అంటూ ప్రధాని మోదీ అప్పుడప్పుడు చేసే హడావిడి అందరూ చూస్తూనే ఉన్నాం. మన్ కీ బాత్ గొప్ప కార్యక్రమం అని చెప్పుకుంటారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పుడు దేశ్ కీ బాత్ అంటూ మరో కార్యక్రమం మొదలు పెట్టారు. "దేశ్ కీ బాత్ - దేశ్ కే భవిష్యత్ కే సాథ్".. అంటూ ఆయన నేరుగా విద్యార్థుల దగ్గరకు వెళ్లి కూర్చుని మాట్లాడుతున్నారు. పరువు నష్టం కేసులో విధించిన శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ని సూరత్ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. రాహుల్ కి అది నిరాశ కలిగించే విషయమే అయినా ఆయన ఏమాత్రం తగ్గడంలేదు. ఆయనలో ఆ ఆందోళన కూడా కనిపించలేదు. ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో విద్యార్థులతో సమావేశమయ్యారు రాహుల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు.
देश की बात, देश के भविष्य के साथ
— Congress (@INCIndia) April 20, 2023
मुखर्जी नगर, दिल्ली में छात्रों के साथ @RahulGandhi जी pic.twitter.com/iYoRtCDSBz
ఢిల్లీ యూనివర్శిటీలోని నార్త్ క్యాంపస్ లో విద్యార్థులతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ముఖర్జీ నగర్ లో విద్యార్థులతో కలిసి రోడ్డు పక్కన కుర్చీలో కూర్చున్నారు. విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. అకడమిక్ పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారు, పోటీ పరీక్షల విషయంలో ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారనే విషయాలను తెలుసుకున్నారు. వారికి కొన్ని సూచనలు చేశారు రాహుల్ గాంధీ.
లోక్ సభ సభ్యత్వం రద్దు చేసిన తర్వాత రాహుల్ గాంధీ చాలా పాజిటివ్ గా స్పందించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ కి రాకుండా అడ్డుకుంటే, తనకున్న సమయాన్నంతా ప్రజలతో గడిపేందుకే ఉపయోగిస్తానన్నారు రాహుల్. అన్నట్టుగానే ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఢిల్లీలో విద్యార్థులతో కలసి రోడ్డు పక్కనే కూర్చుని మాట్లాడుతున్నారు. రాహుల్ తో మాట్లాడేందుకు యువతీ యువకులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.