Telugu Global
National

థ‌రూర్ వ్యాఖ్యలు తోసిపుచ్చిన మ‌నీష్‌ తివారి..కాంగ్రెస్ పార్టీకి ఖ‌ర్గే స్థిరత్వాన్ని అందించగలడని వ్యాఖ్య‌

తనకెవరూ మద్దతు తెలపడం లేదని, అందరూ ఖర్గేకే సపోర్ట్ చేస్తూ తనపట్ల‌ పక్షపాతం చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత శశి థరూర్ చేసిన‌ వ్యాఖ్యలను ఆయన సహచరుడు జి23 నేత మనీష్ తివారీ ఖండించారు. ఖ‌ర్గే కింద స్థాయి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఈ స్థాయికి చేరుకున్న సీనియ‌ర్ నేత అని, పార్టీ ఆయ‌న చేతుల్లో సుర‌క్షితంగా ఉంటుంద‌ని తివారీ అన్నారు.

థ‌రూర్ వ్యాఖ్యలు తోసిపుచ్చిన మ‌నీష్‌ తివారి..కాంగ్రెస్ పార్టీకి ఖ‌ర్గే స్థిరత్వాన్ని అందించగలడని వ్యాఖ్య‌
X

త‌న ప‌ట్ల కాంగ్రెస్ నేత‌లు ప‌క్షపాతం చూపిస్తున్నార‌ని కాంగ్రెస్ అధ్య‌క్ష‌ప‌ద‌వికి పోటీలో ఉన్న ఎంపి శ‌శిథ‌రూర్ వ్యాఖ్య‌ల‌ను జి-23లో ఆయ‌న స‌హ‌చ‌రుడు,కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌నీష్ తివారి తోసిపుచ్చారు. థ‌రూర్ తో పోటీలో ఉన్న మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు తివారీ త‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఖ‌ర్గే కింద స్థాయి నుంచి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి నేడు ఈ స్థాయికి చేరుకున్న సీనియ‌ర్ నేత అని, పార్టీ ఆయ‌న చేతుల్లో సుర‌క్షితంగా ఉంటుంద‌ని తివారీ అన్నారు. సీనియ‌ర్ నేత అయిన ఖర్గే కష్టాల్లో ఉన్న పార్టీకి స్థిరత్వాన్ని అందించగలడని, దానికి స‌మ‌గ్ర వ్య‌క్తిత్వం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు.

కాంగ్రెస్‌కు అధికారిక అభ్యర్థి ఎవరూ లేరని, అంతర్గత ఎన్నికలలో గాంధీ కుటుంబీకులు నిష్పక్షపాతంగా ఉన్నారని థరూర్ అన్నారు. అయితే, గురువారం, చాలా మంది కాంగ్రెస్ అనుభవజ్ఞులు తనకు మొండిచెయ్యి చూపుతున్నార‌ని అన్నారు.

చాలా సందర్భాల్లో సీనియర్‌ రాజకీయ నేతలు ఖర్గేను స్వాగతిస్తున్నారని, అయితే త‌నను స్వాగతించడం లేదని, క‌నీసం అందుబాటులో కూడా ఉండ‌డం లేద‌న్నారు. మద్దతు కోసం తాను అనేక రాష్ట్రాలను సందర్శించానని, అయితే రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లు తనను కలవలేదని ఆయన పేర్కొన్నారు.

ఖ‌ర్గేకు సీనియ‌ర్ల మ‌ద్ద‌తు..

జి-23లో థ‌రూర్ స‌హ‌చ‌రులైన తివారీ, ఆనంద‌శ‌ర్మ తో పాటు సీనియర్ నాయకులు ఎకె ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, అభిషేక్ సింఘ్వి, అజయ్ మాకెన్, భూపీందర్ సింగ్ హుడా, దిగ్విజయ సింగ్, తారిక్ అన్వర్, సల్మాన్ ఖుర్షీద్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, దీపేందర్ సింగ్ హుడా, వి నారాయణసామి, వి వైథిలింగం, ప్రమోద్ తివారీ, ప్రమోద్ తివారీ , అవినాష్ పాండే, రాజీవ్ శుక్లా, సయ్యద్ నసీర్ హుస్సేన్, రఘువీర్ సింగ్ మీనా, ధీరజ్ ప్రసాద్ సాహు, తార్సేమ్ చంద్ బగ్రీ, పృథ్వీరాజ్ చవాన్, కమలేశ్వర్ పటేల్, మూల్‌చంద్ మీనా, దిలీప్ గజ్జర్, సంజయ్ కపూర్ , వినీత్ పునియా త‌దిత‌ర నాయ‌కులంతా ఖ‌ర్గే ప‌క్షాన నిల‌వ‌డంతో ఇక ఆయ‌న ఎన్నిక లాంఛ‌న‌మే.

First Published:  14 Oct 2022 10:39 AM GMT
Next Story