నాకు క్లీన్ చిట్...నా ఇంట్లో సీబీఐకి ఏమీ లభించలేదు.. మనీష్ సిసోడియా
ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు క్లీన్ చిట్ లభించిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. తన ఇంట్లోనూ, ఘజియాబాద్ లోని తన బ్యాంక్ లాకర్ లోను సీబీఐ అధికారులకు ఏమీ లభించలేదని ఆయన చెప్పారు.
లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించిన దాడుల్లో తనకు, తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. తన ఇంట్లోనూ, ఘజియాబాద్ లోని తన బ్యాంక్ లాకర్ లోను సీబీఐ అధికారులకు ఏమీ లభించలేదని ఆయన చెప్పారు. ఈ లాకర్ లో నా భార్యకు, పిల్లలకు చెందిన సుమారు 70 వేల రూపాయల విలువైన జువెల్లరీని మాత్రమే వాళ్ళు కనుగొన్నారు..నా ఇంటిమీద ఈ సంస్థ చేత ప్రధాని దాడి చేయించడం, నా లాకర్ సెర్చ్ చేయించడం నాకెంతో 'సంతోషం'గా ఉంది అని ఆయన సెటైర్ వేశారు. ప్రధాని ఆదేశించిన అన్ని దాడుల్లోనూ తనకు, తన కుటుంబానికి క్లీన్ చిట్ లభించినట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. లాకర్ సెర్చ్ సందర్భంగా సీబీఐ అధికారులు చాలా మర్యాదగా ప్రవర్తించారని, ఏమీ దొరకదన్న విషయం వారికీ తెలుసునని సిసోడియా అన్నారు. కానీ కొన్ని నెలల పాటు నన్ను జైల్లో ఉంచాలన్న మోడీ ఒత్తిడి వారిపై ఉందన్నారు.
సిసోడియా విషయంలో జరిగిన ఈ పరిణామం, మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా చెత్త రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తోందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ డర్టీ పాలిటిక్స్ కి వాళ్ళు (బీజేపీ) స్వస్తి చెప్పి మా పనులను మేం చేసుకునేలా చూస్తారని ఆశిస్తానన్నారు. ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని పాలక ఆప్ నేతలు ఇదివరకే ప్రకటించారు. బీజేపీ చేసిన ఆరోపణలను వారు ఖండించారు. మా ఎమ్మెల్యేలను కొనేందుకు కాషాయ పార్టీ ఒక్కరికి 20 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించడానికి కూడా వెనుకాడలేదని, కానీ తామంతా సమైక్యంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు. తమ ఉపముఖ్యమంత్రి సిసోడియా ఇంట్లో దాడులు నిర్వహించి , ఆయనకు చెందిన లాకర్ లో సెర్చ్ చేసినా ఏమీ లభించదని తామిదివరకే చెప్పామని వారన్నారు.