Telugu Global
National

మణిపూర్ లో మళ్లీ మంటలు.. బీఎస్ఎఫ్ జవాన్ దుర్మరణం

బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు పోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటన తర్వాత మణిపూర్‌ లో ఇంటర్నెట్‌ వాడకంపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 10వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది.

మణిపూర్ లో మళ్లీ మంటలు.. బీఎస్ఎఫ్ జవాన్ దుర్మరణం
X

రిజర్వేషన్ల గొడవ మళ్లీ పెద్దదైంది. ప్రశాంతంగా ఉందనుకున్న మణిపూర్ లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఇప్పటి వరకూ సామాన్య ప్రజలే ఈ గొడవల్లో ప్రాణాలు కోల్పోగా, ఇప్పుడు బీఎస్ఎఫ్ జవాన్ దుర్మరణం పాలయ్యారు. ఆందోళనకారుల గ్రూపు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ తూటాలకు బలయ్యాడు. అస్సాం రైఫిల్స్ కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్యం కోసం తరలించారు.

మైతై తెగకు ఎస్టీ రిజర్వేషన్లను ప్రకటించిన రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అక్కడ హింసకు కారణమైంది. అప్పటికే ఎస్టీ రిజర్వేషన్లు కలిగి ఉన్న గిరిజనులు తమకు అన్యాయం జరుగుతోందంటూ రోడ్డెక్కారు. ఇరు వర్గాల మధ్య గొడవలు పెద్దవై చివరకు దాడులకు కారణమయ్యాయి. ఆ రాష్ట్రంలో ఉంటున్న ఇతర ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లిపోయారు. ఏపీ, తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా తరలి వచ్చేశారు. ప్రస్తుతం పరిస్థితి కుదుడపడుతుందనుకుంటున్న టైమ్ లో మళ్లీ హింస చెలరేగింది.

మణిపూర్‌ లోని సుగ్ను, సెరు ప్రాంతాల్లో ఈ సారి పరిస్థితి అదుపు తప్పింది. బీఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌, స్థానిక పోలీసులు ఇక్కడ గస్తీ విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై ఆందోళనకారులు కాల్పులు జరిపారు. ఈ దాడులను భద్రతా దళాలు తిప్పికొట్టాయని అధికారులంటున్నారు. అయితే బీఎస్ఎఫ్ జవాన్ ప్రాణాలు పోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటన తర్వాత మణిపూర్‌ లో ఇంటర్నెట్‌ వాడకంపై నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 10వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది.

మణిపూర్‌ హింసపై కేంద్రం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి గువహాటి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజేయ్‌ లాంబ నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవల 80 మంది మృతికి కారణమైన అల్లర్లపై ఈ కమిటీ దర్యాప్తు చేపట్టబోతోంది.

First Published:  6 Jun 2023 1:38 PM IST
Next Story