Telugu Global
National

మణిపూర్ లో హింస.. కారణం ఏంటి..?

రాజకీయ స్వలాభం కోసం మణిపూర్ లో మైతై వర్గానికి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలనుకుంటోంది బీజేపీ. గిరిజనుల్లో వ్యతిరేకత పెరిగినా మెజార్టీ వర్గం తమవైపే ఉంటుందనేది ఆ పార్టీ ఆలోచన.

మణిపూర్ లో హింస.. కారణం ఏంటి..?
X

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ తగలబడిపోతోంది. హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. బీజేపీ ప్రభుత్వ నిర్ణయం వల్లే ఈ ఆందోళనలు మొదలయ్యాయి. అధికార పార్టీ నేతలు అగ్నికి ఆజ్యం పోస్తున్నారే కానీ మంటలు చల్లార్చే ప్రయత్నం చేయడంలేదు, ప్రజల్లో అపోహలు పోగొట్టే నిర్ణయాలేవీ తీసుకోలేదు. హింసాత్మక ఘటనలతో మణిపూర్ లో ఆర్మీ మోహరించింది. అసోం రైఫిల్స్ బలగాలు కూడా పహారాకు వచ్చాయి. 16 జిల్లాల మణిపూర్ లో 8చోట్ల కర్ఫ్యూ విధించారు. అల్లర్ల కారణంగా దాదాపు 4వేలమంది నిరాశ్రయులయ్యారు, వారికి ఆర్మీ శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు.

ఎందుకీ అల్లర్లు..

మైతై సామాజిక వర్గాన్ని ఎస్టీల్లో చేర్చేందుకు ఇటీవల మణిపూర్ అసెంబ్లీ అంగీకరించింది. దీంతో గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. వాస్తవానికి మణిపూర్ లో 53శాతం మైతై వర్గానికి చెందినవారే ఉన్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పర్వత ప్రాంతాల్లో నివశించేందుకు కూడా మైతై వర్గానికి అనుమతి లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా వారికి ఎస్టీ రిజర్వేషన్లు కట్టబెట్టడం సరికాదంటూ గిరిజనులు గొడవ చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాలు హింసాత్మక సంఘటనలకు దారి తీశాయి. ప్రార్థనా మందిరాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.

రిజర్వేషన్ల ఆందోళనలు.. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య చిచ్చుపెట్టాయి. మైతై వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ గిరజనులు దాడులకు తెగబడుతున్నారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ ‘గిరిజన సంఘీభావ యాత్ర’కు పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో వేలాదిమంది పాల్గొన్నారు. ఈ ర్యాలీ కూడా ఉద్రిక్తంగా మారింది. మణిపూర్ అల్లర్లపై ప్రముఖ బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని ఆమె కేంద్రాన్ని కోరారు.


రాజకీయ స్వలాభం కోసం మణిపూర్ లో మైతై వర్గానికి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలనుకుంటోంది బీజేపీ. గిరిజనుల్లో వ్యతిరేకత పెరిగినా మెజార్టీ వర్గం తమవైపే ఉంటుందనేది ఆ పార్టీ ఆలోచన. మణిపూర్ లో చిచ్చు రగలడానికి కారణం కమలదళమేనంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. పరిస్థితి సమీక్షిస్తున్నామంటున్నారే కానీ, మణిపూర్ లో హింసాత్మక ఘటనలు మాత్రం ఆగలేదు.

First Published:  4 May 2023 11:18 AM GMT
Next Story