అమిత్ షా ఇంటిని చుట్టుముట్టిన గిరిజన మహిళలు
విద్యాసంస్థలు మూతబడే ఉన్నాయి. ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతోంది. ఈ దశలో తమ రాష్ట్రంపై కేంద్రం దృష్టిపెట్టాలని మణిపూర్ మహిళలు కోరుతున్నారు. అమిత్ షా ఇంటిని చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటిని మణిపూర్ గిరిజన మహిళలు చుట్టుముట్టారు. కుకి తెగకు చెందిన మహిళలు నిరసన చేపట్టారు. మణిపూర్ లో శాంతిని పునురుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినా, ఇంకా అది నెరవేరలేదని చెప్పారు. తమ పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ తమ జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్నారు.
కేంద్రం జోక్యం చేసుకున్నా..
మణిపూర్ అల్లర్లను అదుపు చేయడానికి కేంద్రం కృషి చేసినా ఫలితం కనిపించడంలేదు. పోనీ అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉందా అంటే అదీ లేదు. అక్కడ కూడా బీజేపీనే అధికారంలో ఉంది, రాష్ట్రం పూర్తిగా కేంద్రం మాట వింటుంది. కానీ కేంద్రానికి మణిపూర్ అల్లర్లను అదుపు చేయడం సాధ్యం కాలేదు. కేంద్ర బలగాలను పంపించినా పనికాలేదు. పైగా ఇటీవల అల్లర్లు మరింత పెరిగి బీఎస్ఎఫ్ జవాన్ కూడా దుర్మరణంపాలయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. సామాన్య పౌరులు కూడా మరణించడం విచారకరం.
మైతై తెగకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడంతో గొడవ మొదలైంది. తమ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని అక్కడి గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా గొడవలు మాత్రం ఆగలేదు. దీంతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. మణిపూర్ వదిలి పెట్టి వెళ్లినవారు తిరిగి రావడానికి భయపడుతున్నారు. విద్యాసంస్థలు మూతబడే ఉన్నాయి. ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతోంది. ఈ దశలో తమ రాష్ట్రంపై కేంద్రం దృష్టిపెట్టాలని మణిపూర్ మహిళలు కోరుతున్నారు. అమిత్ షా ఇంటిని చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన చేపట్టారు.